
ముంబై: ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ మురళీ విజయ్ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు. మణికట్టు గాయంతో అతను శ్రీలంకతో జరిగిన సిరీస్‌కు దూరమయ్యాడు. శ్రీలంకతో సొంతగడ్డపై జరిగే తొలి రెండు టెస్టుల కోసం సెలక్షన్ కమిటీ సోమవారం జట్టును ప్రకటించింది. విజయ్ రాకతో మరో ఓపెనర్ అభినవ్ ముకుంద్ చోటు కోల్పోయాడు. వన్డేలకు దూరమైన ప్రధాన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చారు. ఐసీసీ నిషేధంతో లంకతో చివరి టెస్టుకు జడేజా దూరమైన సమయంలో జట్టులోకి ఎంపికైన అక్షర్ పటేల్‌ను కూడా టీమ్ నుంచి తప్పించారు. ఈ మార్పులు మినహా లంకపై క్లీన్‌స్వీప్ చేసిన టీమ్‌నే సెలక్టర్లు కొనసాగించారు. అయితే అందరూ ఊహించినట్లుగా కెప్టెన్ విరాట్ కోహ్లికి మాత్రం ఈ రెండు మ్యాచ్‌ల నుంచి విరామం కల్పించలేదు.
అయితే సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యలను బట్టి చూస్తే మూడో టెస్టుతో పాటు ఆ తర్వాత జరిగే వన్డే, టి20 సిరీస్‌ల నుంచి కోహ్లి విశ్రాంతి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘వ్యక్తిగత’ కారణాలతో కోహ్లి స్వయంగా విరామం కోరినట్లు సమాచారం. ‘కోహ్లి ప్రస్తుతం టెస్టు సిరీస్ బరిలోకి దిగుతున్నాడు. అయితే మా రొటేషన్ విధానం కెప్టెన్‌కు కూడా వర్తిస్తుంది. అతను ఐపీఎల్ నుంచి వరుసగా ఆడుతున్నాడు కాబట్టి కచ్చితంగా విశ్రాంతి అవసరం. కోహ్లితో పాటు కొంత మంది ఇతర ఆటగాళ్లపై కూడా భారం పడుతున్న విషయాన్ని మేం పరిశీలిస్తున్నాం. ఎవరిని ఆడించాలి, ఎవరికి విరామం ఇవ్వాలనే దానిపై మున్ముందు కూడా చర్చిస్తాం’ అని వెల్లడించారు.
భారత టెస్టు జట్టు: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహుల్, ధావన్, పుజారా, రహానే, రోహిత్, సాహా, అశ్విన్, జడేజా, కుల్దీప్, పాండ్యా, షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్, భువనేశ్వర్.