కెయిన్స్‌ కప్‌ క్వీన్‌ హంపి...  | Koneru Humpy Wins Second Edition Of Cairns Cup | Sakshi
Sakshi News home page

కెయిన్స్‌ కప్‌ క్వీన్‌ హంపి... 

Published Tue, Feb 18 2020 1:22 AM | Last Updated on Tue, Feb 18 2020 5:23 AM

Koneru Humpy Wins Second Edition Of Cairns Cup - Sakshi

తెలుగు తేజం, ఆంధ్రప్రదేశ్‌ చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి కెరీర్‌లో మరో గొప్ప విజయం చేరింది. గతేడాది డిసెంబర్‌ చివరి వారంలో ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌గా అవతరించిన ఈ భారత నంబర్‌వన్‌ మహిళా చెస్‌ స్టార్‌... తాజాగా అమెరికాలో జరిగిన కెయిన్స్‌ కప్‌ అంతర్జాతీయ టోర్నమెంట్‌లోనూ విజేతగా నిలిచింది. పది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు క్లాసికల్‌ ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీలో 32 ఏళ్ల హంపి ఆరు పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తాజా ప్రదర్శనతో హంపి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకోనుంది.

సెయింట్‌ లూయిస్‌ (అమెరికా): రెండు నెలల క్రితం ఎవరూ ఊహించని విధంగా ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌గా అవతరించి కొత్త చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి... మళ్లీ అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టింది. ఇద్దరు మాజీ ప్రపంచ చాంపియన్స్‌ అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ (రష్యా), మరియా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌), ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ జూ వెన్‌జున్‌ (చైనా), ప్రపంచ బ్లిట్జ్‌ మాజీ చాంపియన్‌ కాటరీనా లాగ్నో (రష్యా), మూడుసార్లు యూరోపియన్‌ చాంపియన్‌ వాలెంటినా గునీనా (రష్యా)లాంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులు బరిలోకి దిగిన కెయిన్స్‌ కప్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో హంపి చాంపియన్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ టోర్నీలో హంపి ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని అలంకరించింది. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారికతో పోటీపడిన హంపి నల్లపావులతో ఆడుతూ కేవలం 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.

తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి నాలుగు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోయింది. 5.5 పాయింట్లతో జూ వెన్‌జున్‌ రన్నరప్‌గా నిలువగా... 5 పాయింట్లతో మరియా ముజిచుక్‌ మూడో స్థానాన్ని సంపాదించింది. ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి హారిక 4.5 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. లక్షా 80 వేల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహించిన ఈ టోర్నీలో పాల్గొన్న పది మందికీ ప్రైజ్‌మనీ ఇచ్చారు. విజేతగా నిలిచిన హంపికి 45 వేల డాలర్లు (రూ. 32 లక్షల 10 వేలు)... రన్నరప్‌ జూ వెన్‌జున్‌కు 35 వేల డాలర్లు (రూ. 24 లక్షల 97 వేలు)... మూడో స్థానంలో నిలిచిన మరియా ముజిచుక్‌కు 25 వేల డాలర్లు (రూ. 17 లక్షల 83 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తాజా ఫలితంతో హంపి 2585 ఎలో రేటింగ్‌ పాయింట్లతో ప్రపంచ లైవ్‌ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. చైనా గ్రాండ్‌మాస్టర్‌ హు ఇఫాన్‌ 2658 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లోఉంది.

పలువురు మేటి క్రీడాకారిణులు పాల్గొన్న ఈ టోర్నీలో విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీ కోసం ప్రత్యేకంగా రెండు వారాలపాటు ప్రాక్టీస్‌ చేశాను. వివిధ రకాల ఓపెనింగ్స్‌ సాధన చేశాను. రెండు నెలల క్రితం నేను సాధించిన ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ టైటిల్‌ గాలివాటంగా వచ్చినదేమీ కాదని తాజా ప్రదర్శనతో నిరూపించాను. కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత స్వదేశంలో నా ఉద్యోగ సంస్థ పెట్రోలియం స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు ఇంటర్‌ యూనిట్‌ టోర్నమెంట్‌లో పాల్గొంటాను. ఆ తర్వాత మే నెలలో ఇటలీలో జరిగే గ్రాండ్‌ప్రి టోర్నీలో బరిలోకి దిగుతాను. ఈ ఏడాది చివర్లో జరిగే క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధించడమే నా తదుపరి లక్ష్యం. –‘సాక్షి’తో కోనేరు హంపి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement