
న్యూఢిల్లీ : టీమిండియా టి20 జట్టులో కృనాల్ పాండ్యా తొందరగానే తన స్థానాన్ని సుస్థిరపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా అమెరికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో వైట్‌వాష్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కృనాల్ పాండ్యా స్పందిస్తూ ' బ్రదర్ పొలార్డ్ .. నీకు ప్రత్యర్థిగా మ్యాచ్‌లో తలపడడం తనకు సంతోషాన్నిచ్చింది. కానీ నువ్వు నాతో కలిసి ఆడుతున్నప్పుడు ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతుందని' ట్వీట్ చేశాడు.
కాగా, ఐపీఎల్ టోర్నీలో పాండ్యా బ్రదర్స్, కీరన్ పొలార్డ్ ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరు ముగ్గురు కలిసి జట్టుకు అనేక విజయాలు సాధించి పెట్టారు. అంతేగాక ఐపీల్ చరిత్రలోనే అత్యధిక టైటిల్స్ నెగ్గిన ముంబయి ఇండియన్స్ జట్టులో వీరి పాత్ర మరువలేనిది. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరపున ఇప్పటికే విజయవంతమైన ఆటగాడిగా పేరుపొందిన కృనాల్ పాండ్యా టీమిండియా తరపున 14 టి20 మ్యాచ్‌ల్లో 14 వికెట్లతో పాటు, బ్యాట్సమెన్‌గానూ రాణిస్తూ మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.