
పాండ్యా బ్రదర్స్ (ఫైల్ ఫొటో)
ముంబై : సోదరా పెళ్లి వద్దురా అని ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, తన తమ్ముడు హర్దిక్ పాండ్యాకు సలహా ఇస్తున్నాడు. ఈ పాండ్యా బ్రదర్స్ గురించి తెలియని క్రికెట్ అభిమానుల ఉండరు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఈ సోదరులు ఎన్నో అద్భుత ప్రదర్శనలు కనబర్చారు. టీమిండియా ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా రాణిస్తున్న విషయం తెలిసిందే. హార్దిక్ అన్న కృనాల్ పాండ్యాకు భారత జట్టులో చోటుదక్కకున్నా ఐపీఎల్‌లో ఆల్‌రౌండర్‌గా సత్తాచాటాడు. ముఖ్యంగా 2017 సీజన్ ఫైనల్లో మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచి ముంబై టైటిల్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇద్దరూ.. ఆల్‌రౌండర్స్ అయినప్పటికి ఒకరు పేసర్ అయితే.. మరొక స్పిన్నర్. తాజా ఐపీఎల్ సీజన్ అనంతరం ‘వాట్‌ద డక్ షో’లో పాల్గొన్న ఈ అన్నదమ్ములు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
వెస్టిండీస్ క్రికెటర్లంటే ఇష్టం..
తమకు వెస్టిండీస్ క్రికెటర్లంటే అమితమైన ప్రేమ అని చిన్నప్పటి నుంచే వారిపై ఇష్టం కలిగిందని పాండ్యా బ్రదర్స్ చెప్పుకొచ్చారు. ఐపీఎల్ సందర్భంగా ఓ సందర్భంలో ఈ సోదరులు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ పెద్దన్న అని సంబోధించిన విషయం తెలిసిందే. అయితే చిన్నప్పుడు ఎక్కువగా వెస్టిండీస్ మ్యాచ్‌లు చూడటంతో వారిపై ఇష్టం కలిగిందన్నారు. హర్దిక్ చూడటానికి కరేబియన్‌లానే ఉంటాడని, దీంతో అతన్ని అందరు బ్లాక్ అని పిలిచేవారని నాటి రోజులను కృనాల్ గుర్తుచేసుకున్నారు. ఈ విషయంలో తమ తల్లి తనతో వాగ్వాదానికి కూడా దిగేదని కృనాల్ చెప్పుకొచ్చాడు. పాండ్యా మాత్రం వెస్టిండియన్స్ దగ్గర ఏదో ఉందని, వారు చాలా ఉల్లాసంగా ఉంటారని తెలిపాడు.
సరదా సంఘటన..
‘2003 ప్రపంచకప్ సందర్భంగాలో కెన్యా జట్టు సాధన కోసం బరోడా వచ్చింది. ఆ జట్టు ఆటగాళ్లంతా బస్సు కోసం వేచి చూస్తున్నారు. చాలా మంది పిల్లలు ఆటోగ్రాఫ్స్ కోసం వారి దగ్గరకు వెళ్లారు. కానీ ఎవరు ఇవ్వలేదు. అకస్మాత్తుగా హర్దిక్‌ను చూసిన వారు అందరిని పక్కకు తప్పించి అతనికి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఎందుకంటే వారంతా హర్ధిక్‌ను కరెబియన్ పిల్లాడు అనుకున్నారు’అని కృనాల్ నవ్వుతూ చెప్పాడు.
అప్పటి వరకు పెళ్లి వద్దు..
ఇక కృనాల్ గతేడాది తన ప్రేయసిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తన తమ్ముడికి మాత్రం ఇప్పుడే పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చాడు. ‘నా పెళ్లి అనుభవంతో చెబుతున్నా తమ్ముడు ఇప్పుడే పెళ్లి వద్దు. 40 ఏళ్లు వచ్చేవరకు పెళ్లి చేసుకోకు. లేకుంటే నీ పని అంతే’ అని కృనాల్ పేర్కొన్నాడు. దీనికి హర్దీక్ మాట్లాడుతూ.. ‘మా అన్న చాలా చికాకు తెప్పిస్తాడు. కొన్ని సార్లు గదిలో నుంచి బయటికి రానే రాడు.’ అని తెలిపాడు.