
న్యూఢిల్లీ: భారత క్రికెటర్లకు ఇప్పుడు లభిస్తున్న డబ్బు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 2001–02లో పరిస్థితి ఇలా లేదని, ముగ్గురు దిగ్గజ క్రికెటర్ల పోరాటం వల్లే అది సాధ్యమైందని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అప్పట్లో అధికారికంగా ప్లేయర్స్ అసోసియేషన్ లేకపోయినా... సచిన్, ద్రవిడ్, కుంబ్లే బోర్డు ఆదాయంలో ఆటగాళ్లకు వాటా ఉండాలంటూ పోరాడారని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ‘దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఆదాయంనుంచి మా వాటా తీసుకునేందుకు బీసీసీఐతో పోరాడాల్సి వచ్చింది. నాడు సచిన్, ద్రవిడ్, కుంబ్లే మా హక్కుల కోసం నిలదీయకుండా ఉంటే ఈ రోజు పరిస్థితి భిన్నంగా ఉండేదేమో.ఇంత చేసినా అప్పట్లో ఆటగాళ్ల మధ్య విభేదాలు గానీ తిరుగుబాటు గానీ రాలేదనే విషయం కూడా మరచిపోవద్దు’ అని వీరూ గుర్తు చేసుకున్నాడు.