కుంబ్లే కూడా దరఖాస్తు ద్వారానే...
కెప్టెన్ కోహ్లితో విభేదాలు... తన వ్యవహార శైలి నచ్చడం లేదంటూ జట్టు సభ్యుల ఫిర్యాదులు... బీసీసీఐ పెద్దల అసంతృప్తి... ఇవేవీ అనిల్ కుంబ్లే మరోసారి కోచ్ పదవిని ఆశించేందుకు అడ్డు రాలేదు. కోచ్ పదవిని ఆశిస్తూ కుంబ్లే కూడా మళ్లీ అప్లికేషన్ ఇచ్చేశాడు. ప్రస్తుత కోచ్ హోదాలో కుంబ్లే ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, నేరుగా ఇంటర్వూ్యకు హాజరు కావచ్చని కూడా బీసీసీఐ సడలింపు ఇచ్చింది. అయితే దిగ్గజ స్పిన్నర్ మాత్రం దీనిని పట్టించుకోకుండా అందరిలాగే తాను కూడా అంటూ అప్లై చేశాడు. అంతే కాదు... తన పూర్తి బయోడేటాతో పాటు గత ఏడాదిలాగే భారత క్రికెట్ భవిష్యత్తు గురించి తాను ఏమేం చేయాలని భావిస్తున్నాడో స్పష్టంగా రోడ్‌మ్యాప్‌ను కూడా దానికి జత చేశాడు.
విభేదాలవంటి కారణాలతో బాధ పడి తాను తప్పుకునేది లేదని, మరోసారి కోచ్ అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కూడా కుంబ్లే పరోక్షంగా ఈ దరఖాస్తుతో తన సందేశాన్ని పంపించాడు. మరో వైపు ఇంటర్వూ్య ప్రక్రియ, తేదీలను ఖరారు చేసేందుకు క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ త్వరలోనే సమావేశం కానున్నారు. ఆసీస్ మాజీ పేసర్ క్రెయిగ్ మెక్‌డెర్మాట్ కూడా కోచ్ పదవి కోసం దరఖాస్తు చేశాడు. అయితే నిర్ణీత గడువు మే 31 దాటిన తర్వాత ఆ అప్లికేషన్ వచ్చింది. అతని దరఖాస్తును చూసిన తర్వాత సీఏసీ చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది.