కోచ్ రేసులో నిలిచిన సెహ్వాగ్
న్యూఢిల్లీ: భారత్ క్రికెట్ జట్టు కోచ్ పదవికి భారత మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దరఖాస్తు చేసుకున్నాడు. గత కొద్దీ రోజులుగా సెహ్వాగ్ కోచ్ పదవి రేసులో ఉన్నాడంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని నిజం చేస్తూ వీరు నేడు ( గురువారం) కోచ్ పదవికి దరఖాస్తు చేశాడు. చాంపియన్స్ ట్రోఫితో ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే పదవికాలం ముగుస్తుండటంతో బీసీసీఐ కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే కుంబ్లే పదవి కాలాన్ని పొడిగిస్తారని భావించినా.. కెప్టెన్ కోహ్లీ, కోచ్ కుంబ్లేకు పడటం లేదని వార్తలు రావడంతో బీసీసీఐ అనిల్ కుంబ్లేకు ఉద్వాసన పలకే అవకాశం ఉంది.
అయితే బీసీసీఐ నుంచి ఓ అధికారి సెహ్వాగ్‌ను కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను సెహ్వాగ్ ఖండించాడు. తాజాగా కోచ్ పదవికి సెహ్వాగ్ దరఖాస్తు చేసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసీజన్ ఐపీఎల్ లో కింగ్స్ పంజాబ్‌కు కోచ్‌గా మినహా గతంలో పనిచేసిన అనుభవం సెహ్వాగ్ కు లేదు.
ఇప్పటికే అనిల్ కుంబ్లే డైరెక్ట్‌గా కోచ్ పదవి రేసులో ఉండగా, ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ టామ్ మూడీ, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రిచర్డ్ పైబస్‌లు కూడా కోచ్ పదవి రేసులో పోటిపడుతున్నారు. గతంలో టామ్ మూడీ శ్రీలంక కోచ్‌గా, రిచర్డ్ పైబస్ పాక్ కోచ్‌గా వ్యవహరించారు. ఇక మరో ఇద్దరు భారత మాజీ ఆటగాళ్లు కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. మాజీ బౌలర్ దొడ్డ గణేష్, భారత మాజీ కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు రేసులో పోటిపడుతున్నారు.
టామ్ మూడీ, రాజ్ పుత్‌లు గత సంవత్సరం కూడా కోచ్ పదవికి పోటిపడ్డారు. ఇక కోచ్ నియామకంలో బీసీసీఐ సలహా కమిటీ, గంగూలి, లక్ష్మణ్‌లు ఇంటర్వ్యూలు చేయనున్నారు. గతేడాది రవిశాస్త్రి, కుంబ్లేకు పోటి నెలకొనగా సలహా కమిటీ కుంబ్లే వైపే మొగ్గు చూపింది. అయితే ఈ సారి మాత్రం బీసీసీఐ సెహ్వాగ్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తోందని తెలుస్తుంది..