కొలంబో: ఒక సిరీస్ గెలిచిన తర్వాత ఆటగ్లాళ్లు గ్రౌండ్‌లోనే సెలబ్రేషన్స్ చేసుకోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా బైక్‌పై తమ విజయోత్సావాన్ని జరుపుకునే క్రమంలో శ్రీలంక క్రికెటర్ కుశాల్ మెండిస్ కిందపడ్డాడు. బైక్‌పై చక్కర్లు కొడుతుండగా అది కాస్తా అదుపు తప్పడంతో మెండిస్ పడిపోయాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తోజరిగిన మూడు వన్డేల సిరీస్‌ను లంకేయులు 3-0తో క్లీన్‌స్వీప్ చేశారు. తొలి వన్డేలో 91 పరుగుల తేడాతో విజయం సాధించిన శ్రీలంక, రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
కాగా, టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మూడో వన్డేలో ఏకంగా 122 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగేళ్ల తర్వాత వన్డే సిరిస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో కుశాల్ మెండిస్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టకున్నాడు. నాలుగేళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన సందర్భంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. కుశాల్ మెండిస్ బైక్‌పై జట్టులోని సహచర ఆటగాడిని ఎక్కించుకుని స్టేడియంలో చక్కర్లు కొట్టాడు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కిందపడిపోయారు. పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది, జట్టు సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని బైక్‌ను పైకి లేపారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment