
జీవితకాల నిషేధం
చెన్నై: ఊహించినట్లుగానే ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడిపై జీవితకాలం నిషేధం పడింది. ఆర్థిక అవకతవకలతో పాటు క్రమశిక్షణరాహిత్యం, దుష్ర్పవర్తన, బోర్డు హక్కులకు భంగం కలిగించడం వంటి అంశాలను కారణాలుగా చూపుతూ బుధవారం జరిగిన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎమ్)లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
బోర్డు చీఫ్ ఎన్.శ్రీనివాసన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికపై సభ్యులు చర్చలు జరిపారు. ఆ తర్వాత జీవితకాల బహిష్కరణ వేటుకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తీవ్రమైన క్రమశిక్షణరాహిత్యంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడిన మోడి ని... బీసీసీఐ నియమావళిలోని క్లాజ్ 32 (4) ప్రకారం నిషేధించామని బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇక నుంచి బీసీసీఐకి సంబంధించిన కమిటీలు, ఆఫీసుల్లో బాధ్యతలు చేపట్టే హక్కు అతనికి లేదని స్పష్టం చేసింది. సమావేశంలో పాల్గొన్న సభ్యుల్లో కనీసం ఒక్కరు కూడా మోడికి మద్దతుగా నిలువలేదని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు మోడిపై విధించిన నిషేధాన్ని కోర్టులో సవాలు చేస్తామని అతని తరఫు లాయర్ మహమూద్ ఆబ్ది చెప్పారు. అంశం కోర్టు పరిధిలో ఉన్నా.... వ్యక్తిగత పక్షపాతంతో పూర్తి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ హైకోర్టు అనుమతితో...
మూడేళ్ల నుంచి మోడిపై విచారణ జరిపిన అరుణ్ జైట్లీ, జ్యోతిరాధిత్య సింధియాలతో కూడిన క్రమశిక్షణ కమిటీ 134 పేజీల నివేదికను జూలైలో బోర్డుకు అందజేసింది. ఎనిమిది అంశాల్లో అతన్ని దోషిగా ఖరారు చేసింది. దీనిపై చర్యలు తీసుకోవడానికి పూనుకుంటున్న తరుణంలో మోడి కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. కొంతకాలం వేచి చూసిన బీసీసీఐ ఢిల్లీ హైకోర్టు అనుమతితో బుధవారం ఎస్‌జీఎమ్‌ను నిర్వహించింది. అయితే ఈ ఎపిసోడ్‌లో అంతకుముందు చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కింది కోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయొద్దని సుప్రీం కోర్టును ఆశ్రయించిన మోడికి అక్కడ కాస్త ఉపశమనం లభించింది. అతని ఫిర్యాదును స్వీకరించేందుకు కోర్టు అంగీకరించడంతో ఎస్‌జీఎమ్‌ను వాయిదా వేయాలని మోడి బోర్డు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. కానీ దీన్ని తిరస్కరించిన బీసీసీఐ... సమావేశాన్ని నిర్వహించేందుకు మొగ్గు చూపింది.
అసలేం జరిగింది..!
2010 ఐపీఎల్ బిడ్డింగ్ సమయంలో రెండు కొత్త జట్లకు అనుకూలంగా కొన్ని నిబంధనలు మార్చడంతో పాటు కొచ్చి జట్టుకు సంబంధించిన యాజమాన్య విషయాలను మోడి ట్విట్టర్‌లో బయటపెట్టారు. బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సంబంధించిన అత్యంత రహస్య అంశాలను బహిర్గతం చేశాడనే ఆరోపణలతో 25 ఏప్రిల్ 2010 (ఐపీఎల్-3 ఫైనల్ తర్వాత)న క్లాజ్ 32 (4) ప్రకారం బీసీసీఐ... మోడిపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే ఐపీఎల్ కమిషనర్ పదవి నుంచీ తొలగించింది.
2008-10లో ఆర్థిక అవకతవకలకు పాల్పడటంతో పాటు మొత్తం 22 నేరాలను అతనిపై ఆరోపిస్తూ 34 పేజీల సస్పెన్షన్ నోటీసును బోర్డు జారీ చేసింది. ఆ తర్వాత విచారణ కోసం త్రిసభ్య క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసినా అందులో నుంచి చిరయు అమిన్ తప్పుకున్నారు. ద్విసభ్య కమిటీ పంపిన మూడు షోకాజ్ నోటీసులకు మోడి సమాధానమిచ్చినా వ్యక్తిగతంగా మాత్రం హాజరుకాలేదు. మూడేళ్ల పాటు విచారణ చేసిన కమిటీ తమ నివేదికను బోర్డుకు అందజేసింది.
పోరాడతా: మోడి
‘బీసీసీఐ తన నిర్ణయం తీసుకుంది. దానికి తగిన విధంగా నేను కూడా స్పందిస్తా. నేను ఎక్కడికీ వెళ్లదల్చుకోలేదు. ఇక్కడే ఉండి పోరాడతా. శ్రీనివాసన్ చర్యలపై బోర్డు సభ్యులు నిరసన వ్యక్తం చేయాలి. లీగ్ సృష్టికర్త అయిన నాపై నిషేధం విధించారు.
శ్రీనివాసన్ పెద్ద మ్యాచ్ ఫిక్సర్. కానీ ఆయనే బోర్డును నడుపుతున్నారు. ఏదేమైనా వ్యక్తి కంటే బ్రాండ్ గొప్పది. కాబట్టి ఐపీఎల్‌తో నా సంబంధాలు తెగిపోవు. దానికి రూపకల్పన చేసిందే నేను. బోర్డుకు 8 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చా. నేనెప్పుడైనా బీసీసీఐ హక్కులను కాపాడటానికే కృషి చేశా. నేను వైదొలిగిన తర్వాత డెక్కన్ చార్జర్స్, కొచ్చి టస్కర్స్ ఫ్రాంచైజీలను రద్దు చేశారు. దీంతో 700 మిలియన్ డాలర్ల నష్టం కలిగింది. దాన్ని వదిలిపెట్టి నాపై ఆర్థిక ఆరోపణలు చేస్తే ఎలా’
- లలిత్ మోడి
నాడు కింగ్ మేకర్
‘మోడి అంటేనే ఐపీఎల్...నేను సృష్టించిన బ్రాండ్ నాకు పర్యాయపదంగా మారిపోయింది’...లలిత్‌మోడి అధికారిక వెబ్‌సైట్‌లో తన గురించి తాను ఇప్పటికీ చెప్పుకునే పరిచయ వాక్యం ఇది. చాలా మంది వైఫల్యం ఊహించిన చోట మోడి విజయవంతం అయ్యాడు. వ్యాపారవేత్తల కుటుంబం నుంచి వచ్చిన అతను క్రికెట్‌కు కొత్త వ్యాపార సూత్రాలు నేర్పించాడు.
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌లో మొదలైన మోడి ప్రస్థానం ఇప్పుడు బీసీసీఐ బహిష్కరణతో ముగిసింది. క్రికెట్ అభిమాని ప్లస్ బిజినెస్‌మన్‌గా ‘మోడి ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్’ పేరుతో స్పోర్ట్స్ చానల్స్‌తో కలిసి చేసిన వ్యాపారం అతనిలో కొత్త లీగ్ ఆలోచనకు ఊపిరి పోసింది. ఫలితమే టి20 క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో కొత్త అధ్యాయం మొదలైంది.
ఐపీఎల్ రూపకర్తగా తెచ్చుకున్న గుర్తింపుతో మోడి చాంపియన్స్ లీగ్ టి20కి కూడా అంకురార్పణ చేశాడు. ఐపీఎల్‌కు తానే కర్త, కర్మ, క్రియగా ఉంటూ దాదాపు నాలుగేళ్ల పాటు హవా నడిపించిన మోడి, ఈ కాలంలో బీసీసీఐ ఆదాయం దాదాపు రూ. 48 వేల కోట్లకు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. కొత్త కొత్త ఆలోచనలతో బోర్డుకు భారీగా సొమ్ము తెచ్చిపెట్టిన దాదాపు 15కు పైగా కీలక ఒప్పందాల్లో మోడినే సూత్రధారిగా వ్యవహరించాడు. ఒకప్పుడు అంతా తానే అయి నడిపించి...చివరకు అవినీతి ఆరోపణలు, నిబంధనల ఉల్లంఘనలతో దేశం విడిచి వెళ్లిపోవడంతో పాటు నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
మోడిపై జీవితకాల నిషేధం విధించాలనేది ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం. ఇందులో ఎలాంటి ద్వంద్వర్థాలు లేవు. మొదట అనిరుధ్ చౌదరి (హర్యానా) దీన్ని ప్రవేశపెట్టగా... తర్వాత రంజిబ్ బిస్వాల్ (ఒడిస్సా), ఆ తర్వాత అందరూ ఆమోదం తెలిపారు. ఒక్క ఓటు కూడా వ్యతిరేకంగా పడలేదు .
- రాజీవ్ శుక్లా (బీసీసీఐ ఉపాధ్యక్షుడు)