
లండన్: తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను కుప్పకూల్చిన ఐర్లాండ్ బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో పట్టువిడిచారు. ఫలితంగా ఇక్కడి లార్డ్స్‌లో జరుగుతున్న నాలుగు రోజుల టెస్టులో ఆతిథ్య జట్టు ప్రత్యర్థికి కాస్త క్లిష్టమైన లక్ష్యాన్ని విధించే దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 0/0తో గురువారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ వెలుతురు లేని కారణంగా ఆట నిలిపివేసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. మరో వికెట్ చేతిలో ఉండగా ఆ జట్టు 181 పరుగుల ఆధిక్యంలో ఉంది. నైట్ వాచ్‌మన్–ఓపెనర్‌గా వచ్చిన స్పిన్నర్ జాక్ లీచ్ (162 బంతుల్లో 92; 16 ఫోర్లు), వన్‌డౌన్‌లో దిగిన జేసన్ రాయ్ (72 బంతుల్లో 78; 10 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు. రెండో వికెట్‌కు వీరు 145 పరుగులు జోడించారు.
ఈ ఇద్దరితో పాటు డెన్లీ (10), కెప్టెన్ రూట్ (31), బెయిర్ స్టో (0)లను త్వరతరగా ఔట్ చేసి ఐర్లాండ్ పైచేయి సాధించింది. లోయరార్డర్‌లో సామ్ కరన్ (37), స్టువర్ట్ బ్రాడ్ (21 బ్యాటింగ్) దూకుడుగా ఆడి ఆధిక్యాన్ని పెంచారు. అడైర్ (3/66), రాన్‌కిన్ (2/86), థాంప్సన్ (2/44) రాణించారు. మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన ఐర్లాండ్‌కు నాలుగో ఇన్నింగ్స్‌లో దాదాపు 200 పరుగుల లక్ష్య ఛేదన మాత్రం కష్టమే. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 85 పరుగులకు, ఐర్లాండ్ 207 ఆలౌటయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment