
ముంబై: ఆఫ్ స్పిన్నర్‌కు అప్పుడప్పుడు లెగ్ బ్రేక్స్ వేయగల సత్తా ఉంటే అది అదనపు బలమవుతుందని ‘బర్త్ డే బాయ్’ సచిన్ టెండూల్కర్ అన్నాడు. 45వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్న అతను మీడియాతో ముచ్చటించాడు. ఆఫ్ స్పిన్నర్ అయిన అశ్విన్ ఇటీవల సందర్భాన్ని బట్టి లెగ్ బ్రేక్స్ వేస్తున్నాడు. దీనిపై సచిన్ మాట్లాడుతూ ‘వైవిధ్యమనేది ఇక్కడ ఆయుధమవుతుంది. ఎలాగంటే ఒకరికి రెండు, మూడు భాషలు బాగా తెలుసు. అయితే అతడు మరో నాలుగైదు భాషలు నేర్చుకుంటే మంచిదే. బహుభాష కోవిదుడవుతాడు. ఇక్కడ పరిజ్ఞానం పెరుగుతుందే తప్ప తగ్గదు కదా. అలాగే స్పిన్నర్లు వైవిధ్యం చూపగలిగితే వారి అమ్ములపొదిలోని అస్త్రాలు పెరుగుతాయి.
అంతేగానీ అలా వేయడం తప్పు అనడం సమంజసం కాదు. ఇది బంతులు సంధించడంలో పురోగమనంగానే భావించాలి తప్ప... దోషంగా చూడకూడదు. ఇలాంటి దురభిప్రాయాల్నే మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఆఫ్ స్పిన్నర్లు దూస్రాలతో పాటు గూగ్లీలు వేస్తే తప్పేంటి. దీన్ని ఎందుకు కాదనాలి’ అని అన్నాడు. మారుతున్న కాలంతో పాటే క్రికెట్ కూడా మారుతోందన్నాడు. 1991, 92లోనే ఐపీఎల్ వచ్చివుంటే తన ఆట అలాగే ఉండేదన్నాడు. ఐపీఎల్‌నే చూసుకుంటే... ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు చెందిందని చెప్పాడు. వన్డే ప్రపంచకప్ (2011) గెలిచిన రోజు ముంబైలో తన కారు టాప్‌పై అభిమానుల గంతులతో ఏర్పడిన సొట్టల్ని ‘హ్యాపీ డెంట్స్’గా అతను అభివర్ణించాడు.
Comments
Please login to add a commentAdd a comment