మనీష్ పాండే సూపర్ షో
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్ కతా మిడిల్ ఆర్డర్ ఆటగాడు మనీష్ పాండే మెరుపులు మెరిపించి ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మనీష్ మాత్రం మొక్కువోని దీక్షతో ఆడాడు. నాల్గో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన మనీష్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్ మెక్లీన్ గన్ వేసిన ఆఖరి ఓవర్ లో మనీష్ పాండే రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు సాధించి కోల్ కతా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అంతకుముందు క్రిస్ లిన్(32) ఫర్వాలేదనిపించడంతో కోల్ కతా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా ఇన్నింగ్స్ ను గౌతం గంభీర్, క్రిస్ లిన్ లు దాటిగా ఆరంభించారు. అయితే గంభీర్(19)ను జోరుగా ఆడుతున్న సమయంలో కృణాల్ పాండ్యా బౌలింగ్ లో తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు.. అనంతరం రాబిన్ ఊతప్ప(4) కూడా స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యాడు. ఇక గత మ్యాచ్ హీరో లిన్ ను సైతం ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవకపోవడంతో కోల్ కతా తడబడినట్టు కనబడింది. ఆ తరుణంలో బాధ్యత తీసుకున్న మనీష్ పాండే చూడచక్కని ఆట తీరుతో అలరించాడు. వరుస విరామాల్లో కోల్ కతా వికెట్లు కోల్పోయినప్పటికీ మనీష్ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే తొలుత హాఫ్ సెంచరీ చేసుకున్న మనీష్.. ఆ తరువాత బ్యాట్ ఝుళిపించడంతో కోల్ కతా ఇన్నింగ్స్ ను గాడిలోపడింది. ముంబై బౌలర్లలో కృణాల్ పాండ్యా మూడు వికెట్లు సాధించగా, మలింగాకు రెండు వికెట్లు, మెక్లీన్ గన్, బూమ్రాలకు తలో వికెట్ దక్కింది.