సాక్షి, హైదరాబాద్: జేఈ విల్సన్ ఘనా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ సిరీస్‌లో తెలుగు అమ్మాయి మనీషా ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. మహిళల డబుల్స్‌లో రుతుపర్ణతో కలిసి చాంపియన్‌గా నిలిచిన మనీషా... మిక్స్‌డ్ డబుల్స్‌లో అర్జున్‌తో కలిసి రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఘనాలోని అక్రా వేదికగా జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో మనీషా–రుతుపర్ణ (భారత్) ద్వయం 21–11, 21–11తో డోర్‌కస్ అజోకే అడ్సోకన్–చెచువు డెబోరా ఉకెహ్ (నైజీరియా) జంటపై అలవోక విజయాన్ని సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ పోరులో టాప్ సీడ్‌గా బరిలో దిగిన మనీషా–అర్జున్ (భారత్) జంట 19–21, 15–21తో శ్లోక్–రుతుపర్ణ (భారత్) జోడీ చేతిలో కంగుతింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అర్జున్–శ్లోక్ (భారత్) జోడీ 21–11, 21–12తో గోడ్విన్ ఓలోఫువా–అనౌలువాపో జువోన్ ఒపెయోరి (నైజీరియా) జంటపై నెగ్గింది.
పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిరణ్ జార్జ్ (భారత్) 25–23, 21–19తో అడె రెస్కీ వికాయో (అజర్‌బైజాన్)ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ ముగ్ధా ఆగ్రే (భారత్) 10–21, 6–21తో థి త్రాంగ్ వు (వియత్నాం) చేతిలో ఓడిపోయి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. తొలిసారి జరిగిన ఈ టోర్నీలో భారత్ 4 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలను సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment