మాక్స్‌వెల్.. నీ తీరు ఏం బాలేదు!
న్యూఢిల్లీ: భారీ అంచనాలతో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లేన్ మాక్స్‌వెల్ తొలి మ్యాచ్‌లో అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన ఈ బ్యాట్స్‌మెన్ పరుగులేమి చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత ఒకే ఒక ఓవర్ వేసి 11 పరుగులు సమర్పించుకున్నాడు. దీనికి తోడు మ్యాచ్ సందర్భంగా ఎంపైర్ నిర్ణయంపై అతను అసంతృప్తి వెళ్లగక్కాడు. దీంతో మాక్స్‌వెల్ తీరుపై మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతనికి చీవాట్లు పెట్టాడు.
ఢిల్లీ చేతిలో పంజాబ్ చిత్తుగా ఓడిన నేపథ్యంలో మ్యాచ్‌లో తాను చేసిన తప్పును మాక్స్‌వెల్ ఒప్పుకొన్నాడు. రిఫరీ విధించే చర్యలను స్వీకరిస్తానని తెలిపాడు. ఎంపైర్ నిర్ణయంపై అసమ్మతి తెలియడం ద్వారా అతను ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం లెవల్ 1 నేరం చేసినట్టు రుజువైంది. దీంతో అతన్ని రిఫరీ మందలించి వదిలేసినట్టు ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.