పుణేలో అదే జోరు.. | Mayank Agarwal And Virat Kohli power India to 273/3 on Day One | Sakshi
Sakshi News home page

పుణేలో అదే జోరు..

Published Fri, Oct 11 2019 3:34 AM | Last Updated on Fri, Oct 11 2019 5:47 AM

Mayank Agarwal And Virat Kohli power India to 273/3 on Day One - Sakshi

భారత్‌ టాస్‌ గెలవడం...ముందుగా బ్యాటింగ్‌...మూడుకు పైగా రన్‌రేట్‌తో పరుగులు...ఒక బ్యాట్స్‌మన్‌ శతకం...మరో ఇద్దరు ఆటగాళ్ల అర్ధ శతకాలు...తొలి రోజు శుభారంభం...సొంతగడ్డపై ఎన్నో ఏళ్లుగా టెస్టుల్లో సాధారణంగా కనిపించే ఈ దృశ్యం పుణేలోనూ పునరావృతమైంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ చేజిక్కించుకునే లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా రెండో టెస్టును కూడా తమదైన శైలిలో మొదలు పెట్టింది.

మయాంక్‌ వరుసగా రెండో శతకంతో మెరవగా...కోహ్లి, పుజారా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వైజాగ్‌ టెస్టు హీరో రోహిత్‌ విఫలమైనా, భారత్‌కు ఎలాంటి సమస్య ఎదురు కాలేదు. ఆరంభంలో తమకు కాస్త అనుకూలించిన పిచ్‌పై దక్షిణాఫ్రికా పేసర్లు ప్రభావం చూపగలిగారు. అయితే ఫీల్డింగ్‌ వైఫల్యాలతో పాటు కొన్ని సార్లు అదృష్టం కూడా కలిసి రాకపోవడంతో తమకు దక్కిన మంచి అవకాశాలను ఆ జట్టు వృథా చేసుకుంది.  

పుణే: దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన రెండో టెస్టులో తొలి రోజు భారత్‌ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చింది. గురువారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 85.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (195 బంతుల్లో 108; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (105 బంతుల్లో 63 బ్యాటింగ్‌; 10 ఫోర్లు), చతేశ్వర్‌ పుజారా (112 బంతుల్లో 58; 9 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా రాణించారు. మయాంక్, పుజారా రెండో వికెట్‌కు 138 పరుగులు జోడించారు. సఫారీ బౌలర్లలో రబడకు 3 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న కోహ్లి, రహానే (18 బ్యాటింగ్‌) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 75 పరుగులు జత చేశారు. వెలుతురు మందగించడంతో పూర్తి ఆట సాధ్యం కాలేదు. మరో 4.5 ఓవర్ల ముందుగానే అంపైర్లు ఆటను నిలిపివేశారు.  

విహారి స్థానంలో ఉమేశ్‌
రెండో టెస్టులో భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. పుణే పిచ్‌ పేస్‌కు అనుకూలిస్తుందని, చివర్లో రివర్స్‌ స్వింగ్‌ పని చేయవచ్చని భావిస్తున్న నేపథ్యంలో మూడో ఫాస్ట్‌ బౌలర్‌ను బరిలోకి దించింది. ఫలితంగా ఉమేశ్‌ యాదవ్‌కు తుది జట్టులో స్థానం లభించింది. జడేజా, అశ్విన్‌లతో ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉండటంతో అదనపు బ్యాట్స్‌మన్‌ అవసరం లేదని భావించిన మేనేజ్‌మెంట్‌ ఆంధ్ర క్రికెటర్‌ హనుమ విహారిని పక్కన పెట్టింది. దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ డేన్‌ పీట్‌ స్థానంలో పేస్‌ బౌలర్‌ ఆన్‌రిచ్‌ నోర్జేను ఆడించింది. నోర్జేకు ఇదే తొలి టెస్టు కావడం విశేషం.  

కోహ్లి ప్రశాంతంగా...
విరాట్‌ క్రీజ్‌లోకి వచ్చే సమయానికి దక్షిణాఫ్రికా బౌలర్లు మంచి జోష్‌ మీదున్నారు. మహరాజ్‌ కట్టుదిట్టంగా బంతులు వేస్తుండగా, పేసర్‌ నోర్జే మెరుపు వేగంతో బౌలింగ్‌ చేస్తున్నాడు. దాంతో ఏమాత్రం పొరపాటుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడిన కోహ్లి తొలి 73 బంతుల్లో 27 పరుగులకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత బ్యాట్‌ ఝళిపించిన అతను వేగంగా పరుగులు రాబట్టాడు. ఒక దశలో ఆరు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు కొట్టిన అతను... ఫిలాండర్‌ ఓవర్లో రెండు బౌండరీలు బాది 91 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా రెండో కొత్త బంతి తీసుకున్నా కోహ్లిపై అది ఎలాంటి ప్రభావం చూపించలేదు.  

గత మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో సత్తా చాటిన మయాంక్‌ అగర్వాల్‌ అదే ఫామ్‌ను కొనసాగించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న అతను మరో శతకంతో ఆకట్టుకున్నాడు. 5 పరుగుల వద్ద ఎల్బీ కోసం సఫారీలు రివ్యూ కోరినా... అదృష్టవశాత్తూ అంపైర్‌ కాల్‌తో బతికిపోయిన భారత ఓపెనర్‌ ఆ తర్వాత కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. నోర్జే వేసిన బంతి హెల్మెట్‌కు బలంగా తగిలి బౌండరీకి వెళ్లటంతో కొంత కంగారు పడ్డా...148 కిలోమీటర్ల వేగంతో వచి్చన తర్వాతి బంతినే ఫోర్‌గా మలచి మయాంక్‌ బలంగా నిలబడటం విశేషం. ఆ తర్వాత నోర్జే మరో ఓవర్లో మయాంక్‌ మూడు ఫోర్లతో చెలరేగాడు.

మహరాజ్‌ ఓవర్లోనూ వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను ఈ క్రమంలో 112 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.ఆ తర్వాత కూడా మయాంక్‌ ధాటి కొనసాగింది. రెండు సెషన్లలోనూ అతడిని అడ్డుకోవడంలో సఫారీలు విఫలమయ్యారు. విరామం తర్వాత మహరాజ్‌ ఓవర్లో మయాంక్‌ నేరుగా కొట్టిన రెండు వరుస సిక్సర్లు అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. దీంతో 99కు చేరుకున్న అతను... ఫిలాండర్‌ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్‌ దిశగా కొట్టిన ఫోర్‌తో శతకం పూర్తి చేసుకున్నాడు. చివరకు రబడ బౌలింగ్‌లో స్లిప్‌లో ప్లెసిస్‌ చక్కటి క్యాచ్‌ పట్టడంతో  అగర్వాల్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.
 
రాణించిన పుజారా
తనదైన శైలిలో ఓపిగ్గా బ్యాటింగ్‌ చేసిన పుజారా సిరీస్‌లో వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీ సాధించాడు. ‘సున్నా’ వద్ద అతను ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను షార్ట్‌లెగ్‌లో బవుమా వదిలేశాడు. దీనిని పుజారా సమర్థంగా వాడుకున్నాడు. ఆరంభంలో 26 బంతులు ఆడి 6 పరుగులకే పరిమితమైన అతను మహరాజ్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో జోరు పెంచాడు. స్పిన్‌ బౌలింగ్‌లో చూడచక్కటి బౌండరీలతో అలరించిన పుజారా... ముత్తుసామి ఓవర్లో పుల్‌ షాట్‌తో సిక్స్‌ కూడా బాదాడు. మహరాజ్‌ ఓవర్లో కొట్టిన రెండు ఫోర్లతో 107 బంతుల్లో అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది. అయితే రబడ వేసిన బంతికి స్లిప్‌లో సఫారీ కెప్టెన్‌ పట్టిన క్యాచ్‌తో పుజారా పెవిలియన్‌ చేరాడు. 

రోహిత్‌ విఫలం
వైజాగ్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు బాదిన రోహిత్‌ ఇక్కడ కాస్త తడబడ్డాడు. ఫిలాండర్, రబడ కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు శ్రమించిన అతను 29వ బంతికి గానీ బౌండరీ కొట్టలేకపోయాడు. ఆ వెంటనే రబడ వేసిన చక్కటి బంతిని ఆడలేక కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.
 
స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) డు ప్లెసిస్‌ (బి) రబడ 108, రోహిత్‌ (సి) డి కాక్‌ (బి) రబడ 14, పుజారా (సి) డు ప్లెసిస్‌ (బి) రబడ 58, కోహ్లి (బ్యాటింగ్‌) 63, రహానే (బ్యాటింగ్‌) 18, ఎక్స్‌ట్రాలు 12, మొత్తం (85.1 ఓవర్లలో 3 వికెట్లకు) 273.  వికెట్ల పతనం: 1–25, 2–163, 3–198.  
బౌలింగ్‌:
ఫిలాండర్‌ 17–5–37–0, రబడ 18.1–2–48–3, నోర్జే 13–3–60–0, మహరాజ్‌ 29–8–89–0, ముత్తుసామి 6–1–22–0, ఎల్గర్‌ 2–0–11–0.

తొలి సెషన్‌
ఓవర్లు: 25, పరుగులు: 77, వికెట్లు: 1

రెండో సెషన్‌
ఓవర్లు: 28, పరుగులు: 91, వికెట్లు: 1

 మూడో సెషన్‌
 ఓవర్లు: 32.1,
 పరుగులు: 105, వికెట్లు: 1

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement