
విశాఖ: టీమిండియా యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌పై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించాడు. ఏ మాత్రం తడబాటు లేకుండా ఆడటానికి అతని మానసిక బలమే కారణమన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన మయాంక్ ఒక అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా లక్ష్మణ్ కొనియాడాడు. అదే సమయంలో సెహ్వాగ్ తరహా భయంలేని క్రికెట్ ఆడుతున్నాడంటూ లక్ష్మణ్ ప్రశంసించాడు. ‘అతని ఆరాధ్య క్రికెటరైన సెహ్వాగ్‌లానే మయాంక్ ఆడుతున్నాడు. మానసికంగా ఎంతో ధృడంగా ఉన్న కారణంగానే సునాయాసంగా షాట్లు కొడుతున్నాడు. అతను మెరుగైన క్రికెటర్’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
ఇక హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. ‘ మయాంక్‌కు సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. అతను ఆట తీరు చాలా మెరుగ్గా ఉంది. మయాంక్ ఫుట్‌వర్క్ చాలా బాగుంది. ప్రత్యేకంగా అతను కొట్టే రివర్స్ స్వీప్ షాట్లు అతనిలోని ప్రతిభను చాటుతున్నాయి. దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటుకుని అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేవారు ఎక్కువగా నేర్చుకుంటున్నారు. వారు జాతీయ జట్టులో రావడానికి ఆలస్యం అవుతుంది.. కానీ మంచి నైపుణ్యాన్ని మాత్రం సాధిస్తున్నారు. మయాంక్ ఇలానే కష్టపడి జట్టులోకి వచ్చాడు’ అని భజ్జీ పేర్కొన్నాడు.