మెస్సీ మ్యాజిక్
► ఫైనల్లో అర్జెంటీనా
► సెమీస్‌లో అమెరికాపై ఘన విజయం
► కోపా అమెరికా కప్
హూస్టన్: వ్యూహాత్మక కదలికలు... సహచరులతో చక్కని సమన్వయం... ప్రత్యర్థులను బురిడి కొట్టించే షార్ట్ పాస్‌లతో అలరించిన స్టార్ స్ట్రయికర్ లియోనల్ మెస్సీ... కోపా అమెరికా కప్‌లో మరోసారి మ్యాజిక్ చేశాడు. కీలక సమయంలో గోల్ సాధించడంతో పాటు సహచరుల గోల్స్‌లోనూ ప్రముఖ పాత్ర పోషించడంతో... బుధవారం జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 4-0తో అమెరికాపై ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. లావెజ్జీ (3వ ని.), మెస్సీ (32వ ని.), హిగుయాన్ (50, 86వ ని.)లు అర్జెంటీనాకు గోల్స్ అందించారు. 1993 తర్వాత ఇంతవరకు కోపా టైటిల్‌ను గెలవని అర్జెంటీనా.... గతేడాది ఫైనల్‌కు చేరినా చిలీ చేతిలో ఓడింది. దీంతో ఈసారి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన అర్జెంటీనాకు నిలకడ విజయాలు అందిస్తున్న మెస్సీ... అమెరికాపై కూడా తన ప్రభావాన్ని చూపెట్టాడు. రెండు ఫ్లాంక్‌ల నుంచి అటాకింగ్ మొదలుపెట్టడంతో ఆరంభంలో అమెరికా డిఫెన్స్ కాస్త తడబడింది.
దీంతో మూడో నిమిషంలో బనేగా ఇచ్చిన కార్నర్ పాస్‌ను లావెజ్జీ నేర్పుగా నెట్‌లోకి పంపి అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు. తర్వాత యూఎస్ స్ట్రయికర్లు.. అర్జెంటీనా రక్షణశ్రేణిని ఛేదించినా గోల్స్ మాత్రం చేయలేకపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాక్‌లైన్ నుంచి మెస్సీ ఇచ్చిన పాస్‌ను లావెజ్జీ వృథా చేశాడు. కానీ మరో 29 నిమిషాల తర్వాత బెకర్‌మెన్, క్రిస్‌లు సమన్వయం తప్పడంతో బంతిని అందుకున్న మెస్సీ 26 గజాల నుంచి కొట్టిన ఫ్రీకిక్ గోల్ పోస్ట్‌ను ఛేదించింది. అంతర్జాతీయ కెరీర్‌లో మెస్సీకి ఇది 55వ గోల్. రెండో అర్ధభాగం మొత్తం యూఎస్.. మెస్సీని లక్ష్యంగా చేసుకుంది. దీంతో చిన్నచిన్న పాస్‌లను సహచరులకు అందిస్తూ స్కోరు చేసే అవకాశాలు కల్పించాడు. ఫలితంగా ఐదు నిమిషాల తర్వాత ఆఫ్‌సైడ్ నుంచి యూఎస్ ఆటగాళ్లను తప్పిస్తూ లావెజ్జీ ఇచ్చిన పాస్‌ను హిగుయాన్ ఎలాంటి తేడా లేకుండా లక్ష్యాన్ని చేర్చాడు.
దీంతో యూఎస్‌పై ఒత్తిడి ఒక్కసారిగా పెరిగిపోయింది. కానీ అర్జెంటీనా డిఫెన్స్‌ను ఛేదించడానికి వాళ్లు చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. మరో 36 నిమిషాల తర్వాత బ్రిన్‌బామ్ చేసిన ఘోర తప్పిదం అర్జెంటీనాకు నాలుగో గోల్ తెచ్చిపెట్టింది. 20 గజాల దూరం నుంచి మెస్సీ ఇచ్చిన అద్భుతమైన పాస్‌ను హిగుయాన్ అంతే అద్భుతంగా నెట్‌లోకి పంపడంతో అమెరికా నివ్వెరపోయింది. కొలంబియా, చిలీల సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో... ఆదివారం జరిగే ఫైనల్లో అర్జెంటీనా తలపడుతుంది.