
టాలెంటెడ్ ఆటగాడైన పాండ్యా భారత జట్టుకు చాలా అవసరం.
సిడ్నీ : మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో సస్పెన్షన్‌కు గురైన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కచ్చితంగా 2019 ప్రపంచకప్ ఆడుతాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. పాండ్యా భారత జట్టులో కీలక ఆటగాడని, జట్టు సమతూకంగా ఉండాలంటే పాండ్యా ఉండాల్సిందేనని క్లార్క్ చెప్పుకొచ్చాడు. కాఫీ విత్ కరణ్ షోలో పాండ్యా, రాహుల్‌లు ఒళ్లు మరిచి మహిళల పట్ల అశ్లీలంగా మాట్లాడటంతో తీవ్రదుమారం రేగడం.. బీసీసీఐ వారిపై నిషేధం విధించడం తెలిసిందే. ఈ వ్యవహారంపై క్లార్క్ నేరుగా మాట్లాడకుండా పరోక్షంగా ప్రస్తావిస్తూ పాండ్యాకు మద్దతు తెలిపాడు.
‘టాలెంటెడ్ ఆటగాడైన పాండ్యా భారత జట్టుకు చాలా అవసరం. ఒంటరిగా మ్యాచ్‌లను గెలిపించే సత్తా పాండ్యాకు ఉంది. అతను ప్రపంచకప్‌లో కచ్చితంగా ఆడుతాడు. ఎంత డబ్బు సంపాదించావనేది అనవసరం. గౌరవ, మర్యాదలే ముఖ్యం. పెద్దలను గౌరవించడం నుంచే ఇది అలవాటవుతోంది. ఇక ఫ్రొఫెషనల్ ఆటగాళ్లు చాలా మందికి రోల్ మోడల్స్. వారిని అందరు గుర్తుపడుతారు. కావున వారంతా చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. కానీ ఆ తప్పును గణపాఠంగా తీసుకొని ముందుకు సాగడమే చాలా అవసరం.’ అని పాండ్యా వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించాడు.
ఇక ఈ వివాదాన్ని పరిష్కరించడంలో బీసీసీఐ తాత్సారం చేయడంపై మాజీ క్రికెటర్లు, అభిమానులు మండిపడుతున్నారు. ప్రపంచకప్ ముందు ఈ యువ ఆటగాళ్లకు ప్రాక్టీస్ చాలా అవసరమని, వెంటనే ఎదో ఒక నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ యువ ఆటగాళ్లపై విధించిన నిషేధాన్ని విచారణ పూర్తయ్యే వరకు ఎత్తివేయాల్సిందిగా బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా... క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ)కి లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్‌నకు నాలుగు నెలలే ఉన్నందున వీరికి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని, వర్ధమాన ఆటగాళ్లైనందున ఓ అవకాశం ఇద్దామని ఖన్నా విజ్ఞప్తి చేశారు. వారు ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పారని, విచారణ కొనసాగిస్తూనే, రాహుల్, పాండ్యాలను తక్షణమే జాతీయ జట్టులోకి తీసుకోవాలని సీఓఏ, బీసీసీఐ అధికారులను ఆయన కోరారు.