
సిడ్నీ: ఇప్పటివరకు 219 వన్డేల్లో 59కి పైగా సగటుతో 39 సెంచరీలతో 10,385 పరుగులు చేసిన విరాట్ కోహ్లియే ఆల్‌టైమ్ నెంబర్ వన్ వన్డే బ్యాట్స్‌మన్ అని ఆస్ట్రేలియా మాజీ సారథి మైఖెల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. గొప్ప ఆటగాడిగానే కాకుండా తెలివైన సారథి అంటూ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆసీస్ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్ గెలిచిన ఏకైక భారత, ఆసియా సారథిగా రికార్డు నెలకొల్పడం సాదారణ విషయం కాదన్నాడు. కోహ్లి వయసు ముప్పైయేనని మరింత క్రికెట్ ఆడే అవకాశం ఉన్నందున్న మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశం ఉందన్నాడు.
ఇక టెస్టుల్లోనూ ప్రస్తుతం కోహ్లి అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నప్పటికీ మరింత రాటు దేలాల్సిన అవసర ముందన్నాడు. ప్రపంచంలోని అన్ని అత్యున్నత మైదానాలలోనూ గొప్పగా రాణించాల్సిన అవసరముందన్నాడు. అలా అయితేనే టెస్టుల్లో కూడా ఆల్‌టైమ్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడని పేర్కొన్నాడు. ఇక కోహ్లి సేన ఆస్ట్రేలియాపై చారిత్రక సిరీస్‌లు గెలిచిన అనంతరం ఐదు వన్డేల సిరీస్ కోసం న్యూజిలాండ్‌కు బయలుదేరింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 23 తొలి వన్డే జరగనుంది.