విజయంతో వీడ్కోలు
►చివరి టెస్టులో పాక్ విజయం
►ఆటకు మిస్బా, యూనిస్ టాటా
►విండీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ సొంతం
రొసియూ (డొమినికా): ఒక్క బంతి... ఒకే ఒక్క బంతి... ఉత్కంఠకు తెరదించింది. చివరి వరుస బ్యాట్స్‌మన్‌ను బౌల్డ్ చేసింది. ఓ జట్టును చివరి టెస్టులో గెలిపించింది. 1–1తో సమమయ్యే సిరీస్‌ను 2–1తో మురిపించింది. ...ఆ బంతి యాసిర్ షాది. ఈ విజయం పాకిస్తాన్‌ది. అంతేకాదు... పాక్ వెటరన్స్ మిస్బా ఉల్ హక్, యూనిస్ ఖాన్‌లకు ఘనమైన వీడ్కోలు పలికింది. పాక్ బౌలర్ యాసిర్ షా చివరి బంతి వేసేందుకు సిద్ధమయ్యాడు. ఐదో రోజు ముగిసేందుకు... అతని తర్వాత మరో ఓవర్ మాత్రమే మిగిలుంది. ఈ ఏడు బంతులాడితే వెస్టిండీస్ చివరి టెస్టును డ్రా చేసుకుంటుంది. మూడు టెస్టుల సిరీస్ 1–1తో డ్రా అవుతుంది.
దీంతో తీవ్ర ఉత్కంఠ మధ్య యాసిర్ బంతి వేశాడు. క్రీజులో ఉన్న గాబ్రియెల్ (4) వైడ్‌గా వెళుతున్న దాన్ని వికెట్లపై ఆడుకున్నాడు. అతని బ్యాట్ అంచును తాకుతూ బంతి వికెట్లకు తగిలింది. అంతే గాబ్రియెల్ బౌల్డ్! ఇక ‘డ్రా’ తప్పదేమో... అనుకునే దశలో అనూహ్య మలుపు పాక్‌ను గెలుపు వైపు తిప్పింది. ఈ మ్యాచ్‌లో పాక్ 101 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దాంతో వెస్టిండీస్ గడ్డపై పాక్ తొలిసారి సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. 304 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండీస్ చివరి రోజు 96 ఓవర్లలో 202 పరుగుల వద్ద ఆలౌటైంది. కడదాకా మొండిగా పోరాడిన చేజ్ (239 బంతుల్లో 101 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఈ మ్యాచ్‌తో రిటైర్మెంట్ ప్రకటించిన మిస్బా 75 టెస్టులు ఆడి 5,222 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. యూనిస్ 118 టెస్టులు ఆడి 10,099 పరుగులు సాధించాడు. ఇందులో 34 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
సంక్షిప్త స్కోర్లు: పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్: 376; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 247; పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్: 174/8; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 202 ఆలౌట్ (96 ఓవర్లలో) (చేజ్ 101 నాటౌట్, హెట్మెయిర్ 25, హోల్డర్ 22; యాసిర్ షా 5/92, హసన్ అలీ 3/33).
అన్ని రకాల క్రికెట్‌ను ఆడేశాను. ఏ జట్టుకు ఆడినా... నూటికి 200 శాతం అంకితభావంతో ఆడా. నా లైఫ్‌లో నేను 27, 28 ఏళ్లు క్రికెట్‌కే వెచ్చించానని భావిస్తున్నా. ఇక మళ్లీ రిటైర్మెంట్‌ను సమీక్షించుకునే అవసరంగానీ, తిరిగి బరిలోకి దిగాలన్న ఆశగానీ లేదు.
–యూనిస్ ఖాన్
నా కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకుంటే... నేను చేయగలిగిన దానికంటే కొంచెం ఎక్కువే చేశానన్న అనుభూతి ఉంది. జట్టు కోసం నా శక్తిమేర పోరాడాను. సారథిగా నడిపించాను. ఉన్న వనరులతో, గడ్డు పరిస్థితుల్లో సాధించిన విజయాలతో సంతృప్తిగా ఉంది.
–మిస్బా ఉల్ హక్