టెన్షన్ వదిలేయ్.. పతకం 'పట్టు' : ప్రధాని మోదీ
డోపింగ్ వివాదం నుంచి బయటపడి రిలాక్స్ అవుతున్న భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. డోపింగ్ వివాదం, కొన్ని రోజుల ఉత్కంఠకు తెరపడ్డ తర్వాత రియోకు వెళ్లనున్న నేపథ్యంలో ప్రధాని మోదీని నర్సింగ్ మర్యాద పూర్వకంగా కలుసుకుని తన పరిస్థితిని వివరించాడు. మోదీతో భేటీ తర్వాత నర్సింగ్ మీడియాతో మాట్లాడారు. మోదీ తనతో మాట్లాడుతూ... 'ఇక ఉత్సాహంగా ఒలింపిక్స్ లో పొల్గొనాలి. టెన్షన్ పడవద్దు.. కుస్తీలో పట్టుపట్టి ఒలింపిక్స్ లో పతకం పట్టుకురావాలి' అని తనకు ఆల్ ది బెస్ట్ చెప్పారని నర్సింగ్ వెల్లడించాడు.
అంతా మంచి జరుగుతుందని, ఎవరికీ అన్యాయం జరగకుండా తాము చూస్తామని మోదీ ఉత్సాహాన్ని నింపారని నర్సింగ్ తెలిపాడు. ఒలింపిక్స్ లో పాల్గొంటానని తాను బలంగా విశ్వసించానని, దేశం కోసం కచ్చితంగా పతకంతో తిరిగొస్తానని ధీమా వ్యక్తంచేశాడు. డోపింగ్‌లో పట్టుబడిన నర్సింగ్ యాదవ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సోమవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీంతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు నర్సింగ్‌కు లైన్ క్లియర్ అయింది.