టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ
కోల్‌కతా : లైంగిక ఆరోపణలు, గృహ హింస చట్టం కేసులతో భర్త, టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీని ఉక్కిరి బిక్కిరి చేసిన హసీన్ జహాన్ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. దీంతో టీమిండియా క్రికెటర్ షమీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. భార్య హసీన్ జహాన్ చేసిన ఫిర్యాదుతో షమీకి కోల్‌కతా అలీపూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 20వ తేదీన కోర్టుకు హాజరు కావాలని క్రికెటర్‌ను ఆదేశించింది.
భార్య ఫిర్యాదు అనంతరం గత మార్చి నెలలో షమీ లక్ష రూపాయల చెక్కును ఇచ్చాడు. తనకు షమీ ఇచ్చిన లక్ష రూపాయల చెక్ (నెంబర్ 03718) బౌన్స్ అయిందని హసీన్ జహాన్ ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన అలీపూర్ కోర్ట్ సెప్టెంబర్ 20న విచారణకు హాజరు కావాలని క్రికెటర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, నెలకు తనకు రూ.10 లక్షల భరణం ఇవ్వాలని షమీని భార్య డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కుటుంబ పోషణకు 7లక్షల రూపాయలు, తమ పాప కోసం 3 లక్షలు ఇవ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. తన బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం భార్య ఎప్పుడో ఖాళీ చేసిందని ఆరోపించిన షమీ.. ఈ నేపథ్యంలో ఇచ్చిన లక్ష రూపాయల చెక్ బౌన్స్ వ్యవహారం షమీకి తలనొప్పిగా మారింది.
మరోవైపు ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో పేసర్ షమీకి బీసీసీఐ చోటిచ్చింది. ఇటీవల నిర్వహించిన యోయో టెస్టులో విఫలమవడంతో ఇంగ్లండ్, ఐర్లాండ్‌లతో జరిగిన పొట్టి ఫార్మాట్ సిరీస్‌లకు దూరమైన షమీకి అలా గుడ్ న్యూస్ తెలిసి సంతోషించేలోపే.. ఈ బ్యాడ్ న్యూస్ తెలిసింది. గతంలోనూ భార్య ఆరోపణల నేపథ్యంలో షమీకి బీసీసీఐ తొలుత ఆటగాళ్ల కాంట్రాక్ట్ ఇవ్వలేదు. ప్రాథమిక విచారణ అనంతరం షమీకి క్లీన్‌చిట్ రావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో, భారత జట్టులో ఆడేందుకు పర్మిషన్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment