
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) భాగంగా తమ దేశంలో జరగబోయే ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఆడటానికి విదేశీ క్రికెటర్లు ఆసక్తి చూపకపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది చాలా బాధాకర విషయమని ఆవేదన వ‍్యక్తం చేసిన మొయిన్.. దీనింతటికీ తమ దేశ క్రికెట్ బోర్డు పీసీబీనే కారణమన్నాడు.
ఈ సీజన్ పీఎస్‌ఎల్ లీగ్ మ్యాచ్‌లు యూఏఈ వేదికగా జరగగా, ప్లే ఆఫ్ మ్యాచ్‌లు మాత్రం పాకిస్తాన్‌లో జరగాల్సి ఉంది. అయితే పాకిస్తాన్‌కు రావడానికి విదేశీ ఆటగాళ్లు నిరాకరించడంపై మొయిన్ ఖాన్ మండిపడ్డాడు.
ఇలా జరగడానికి పీసీబీ ఉదాసీనతే కారణమని విమర్శలకు దిగాడు. ‘ఇటువంటి బాధాకర పరిస్థితికి మా క్రికెట్ బోర్డు పెద్దలే కారణం. పాకిస్తాన్‌లో విదేశీ ఆటగాళ్లు ఆడితేనే పీఎస్‌ఎల్లో ఆడటానికి అనుమతించాలి. మా బోర్డు మాత్రం లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లకు ఎటువంటి ఆంక్షలు విధించలేదు. అందుకే పాకిస్తాన్‌లో ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్లు రావడానికి మొగ్గుచూపడం లేదు. మా బోర్డుకు నా మాటలు రుచించకపోవచ్చు. భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటే పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి, పీఎస్‌ఎల్ పరిస్థితి దారుణంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పాకిస్తాన్‌లో క్రికెట్‌ను బ్రతికించుకునేందుకు పీసీబీ సీరియస్‌గా దృష్టి సారించాలి' అని మొయిన్ ఖాన్ తెలిపాడు. పీఎస్‌ఎల్‌లో క్వెటా గ్లాడియేటర్స్ హెడ్ కోచ్‌గా మొయిన్ ఖాన్ వ్యవహరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment