పతకాలు సరే.. డబ్బేది?
ముంబై: ఒలింపిక్స్ తరహా మెగా ఈవెంట్లలో పతకాలు సాధించడం గొప్ప విషయమైనా, ఆయా క్రీడాకారులకు ఆర్థికంగా చేయూతనివ్వాల్సిన అవసరం చాలా ముఖ్యమని బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమర్ అభిప్రాయపడ్డాడు. క్రీడాకారులు సాధించిన పతకాలు ఒక ఎత్తైతే, వారికి నజరానాలను అందజేయడం అంతకంటే ముఖ్యమన్నాడు.
'ఒక పతకాన్ని కానీ, సర్టిఫికెట్ను కానీ సాధించడం అనేది చాలా గొప్ప విషయం. మరి అవి సాధించిన క్రీడాకారులను ఆర్థికంగా కూడా ఆదుకోవాలి. మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే పతకం కంటే డబ్బే ప్రధానం. నేను చాలా మంది బీద క్రీడాకారుల్ని చూశాను. పలు సందర్భాల్లో ఆర్థికపరిస్థితి బాలేక వారు పతకాలను కూడా అమ్మేసి పరిస్థితి ఏర్పడుతూనే ఉంది. ఇదంతా వారికి డబ్బు లేకపోవడం వల్లే కదా. అమెరికా, చైనా క్రీడాకారులు పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉండటానికి, భారత్ లాంటి దేశం సింగిల్ డిజిట్ పతకానికే పరిమితం కావడం కూడా ఆయా క్రీడాకారులు ఆర్థిక పరిస్థితే కారణం' అని 'రుస్తుమ్' సక్సెట్ మీట్ సందర్భంగా అక్షయ్ పేర్కొన్నాడు.