సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను గాయాల బెడద వేధిస్తోంది. శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్‌లు అర్థాంతరంగా ఫీల్డ్ నుంచి వైదొలగడం ఆ జట్టు యాజమాన్యం కలవరానికి గురి చేసింది. విండీస్ బ్యాటింగ్‌కు దిగిన సమయంలో ఇయాన్ మోర్గాన్ నడుంనొప్పితో మైదానాన్ని వీడగా, జేసన్ రాయ్ తొడ కండరాల గాయంతో గ్యాలరీకి పరిమితమయ్యాడు. దాంతో వీరిద్దరూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
కాగా, తమ గాయాలపై 48 గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని మోర్గాన్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించాడు. ఈ క్రమంలోనే నించునే మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. తాను కూర్చుంటే నొప్పి తీవ్రత ఎక్కువ ఉందని స్వయంగా మోర్గానే ప్రకటించాడు. రాయ్‌తో పాటు తాను గాయాలు బారిన పడ్డా, అవి అంత తీవ్రమైన గాయాలుగా పరిగణించడం లేదన్నాడు. కాగా, ఒక జట్టులో ఒకేసారి ఇద్దరు గాయాల బారిన పడటం మాత్రం జట్టులో ఆందోళన రేకెత్తిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఒకవేళ మంగళవారం అఫ్గానిస్తాన్‌తో జరుగనున్న మ్యాచ్‌కు వీరిద్దరూ సిద్దంకాని పక్షంలో జేమ్స్ విన్సే, మొయిన్ అలీలు తుది జట్టులో ఆడే అవకాశం ఉంది.
వెస్టిండీస్ మ్యాచ్‌లో ఓపెనర్ జేసన్ రాయ్ స్థానంలో జోరూట్ దిగగా, ఫస్ట్ డౌన్‌లో క్రిస్ వోక్స్ వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 33.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రూట్ సెంచరీతో మెరవగా, వోక్స్ 40 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ సునాయాసంగా గెలుపును అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment