విరాట్ కోహ్లి
ముంబై: గత ఏడాది సరిగ్గా ఇదే సమయానికి శిఖర్ ధావన్ భారత టెస్టు జట్టులోనే లేడు. వన్డేల్లో కూడా అప్పటికి దాదాపు ఏడాది విరామం తర్వాత జట్టులోకి వచ్చాడు. ‘సి’ గ్రేడ్ కాంట్రాక్ట్ ఉన్న అతను ఏడాదికి రూ. 50 లక్షలు అందుకుంటున్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు. ఇప్పుడు సంవత్సరం తిరిగే సరికి అతనికి ఒక్కసారిగా మూడు ప్రమోషన్‌లు లభించాయి. ఇప్పుడు ధావన్ ‘ఎ ప్లస్’ గ్రేడ్‌లోకి ఎగబాకాడు. కొత్త కాంట్రాక్ట్ ప్రకారం శిఖర్ ఏడాదికి రూ. 7 కోట్లు అందుకోనున్నాడు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 1300 శాతం ఎక్కువ కావడం విశేషం! 2017 అక్టోబర్ 1 నుంచి 2018 సెప్టెంబర్ 30 వరకు వర్తించే విధంగా బీసీసీఐ బుధవారం కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. మొత్తం 26 మందికి ఇందులో చోటు దక్కింది. ఇందులో భాగంగా తొలిసారిగా ‘ఎ ప్లస్’ గ్రేడ్‌ను కూడా చేర్చింది. ఇందులో ఐదుగురుకి చోటు కల్పించింది. మూడు ఫార్మాట్‌లలో రెగ్యులర్ సభ్యులైన కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లతో పాటు పేసర్లు భువనేశ్వర్, జస్‌ప్రీత్ బుమ్రాలు మాత్రమే ఇందులో ఉన్నారు. రోహిత్, భువీ, బుమ్రా కూడా ‘బి’ నుంచి ‘ఎ ప్లస్’కు ఎగబాకారు. గత ఏడాది ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న మహేంద్ర సింగ్ ధోని, అశ్విన్ అందులోనే కొనసాగనున్నారు. ధోని ఆడుతున్న మ్యాచ్‌ల సంఖ్య పరిమితంగా ఉండటం దీనికి కారణం కాగా... అశ్విన్, జడేజా వన్డేలకు దూరమయ్యారు. గత ఏడాదిలాగే రహానే, పుజారా, మురళీ విజయ్‌ల పేర్లు ఈ జాబితాలో చోటు చేసుకోగా, వికెట్ కీపర్ సాహా గ్రేడ్ ‘సి’ నుంచి ‘ఎ’కు ప్రమోట్ కావడం విశేషం. గత సంవత్సరం కాంట్రాక్ట్ దక్కని రైనా, కుల్దీప్ యాదవ్, దినేశ్ కార్తీక్‌లకు చోటు దక్కగా... భారత్ తరఫున సంవత్సరం క్రితం ఆఖరి మ్యాచ్ ఆడిన జయంత్ యాదవ్‌కు కూడా కాంట్రాక్ట్ దక్కింది.
మిథాలీ రాజ్‌కు రూ. 50 లక్షలు...
మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్ ఫీజులను కూడా బీసీసీఐ భారీగా పెంచింది. ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు ఇప్పుడు ఏడాదికి రూ. 50 లక్షల (గత ఏడాది రూ. 15 లక్షలు) చొప్పున లభిస్తుంది. ఈ జాబితాలో స్టార్ ప్లేయర్లు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధన ఉన్నారు. మరో ఆరుగురికి ‘బి’ గ్రేడ్ (రూ. 30 లక్షలు)లో అవకాశం కల్పించగా... కొత్తగా గ్రేడ్ ‘సి’ని (రూ. 10 లక్షలు) చేర్చి ఇందులో 9 మందిని చేర్చారు. దేశవాళీ క్రికెట్‌లో (రంజీ ట్రోఫీ తదితర) కూడా మ్యాచ్ ఫీజులు ఏకంగా 200 శాతం పెరగడం మరో విశేషం. సీనియర్ పురుషుల విభాగంలో మ్యాచ్ జరిగే రోజుల్లో తుది జట్టులో ఉండే ఆటగాడికి రోజుకు రూ. 35 వేల చొప్పున చెల్లిస్తారు. ఇదే తరహాలో సీనియర్ మహిళల మ్యాచ్‌కు రోజుకు రూ. 12,500 చొప్పున లభిస్తుంది. క్రీడాకారులకు కాంట్రాక్ట్ మొత్తం అందించేందుకు బోర్డు తమ పీఆర్/సీఈఎఫ్ ఫండ్ నుంచి ఏడాదికి రూ. 125 కోట్లు కేటాయిస్తోంది. ఒకవేళ బోర్డు ఆదాయంలో కోత పడినా ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తు అంచనాలను పరిగణనలోకి తీసుకుంటూ కాంట్రాక్ట్‌లు ప్రకటించామని బీసీసీఐ వెల్లడించింది.
ఎవరెవరు ఎక్కడ..
‘ఎ ప్లస్’ గ్రేడ్ (రూ. 7 కోట్లు): కోహ్లి, రోహిత్, ధావన్, భువనేశ్వర్, బుమ్రా.
‘ఎ’ గ్రేడ్ (రూ. 5 కోట్లు): అశ్విన్, జడేజా, విజయ్, పుజారా, రహానే, ధోని, సాహా.
‘బి’ గ్రేడ్ (రూ. 3 కోట్లు): రాహుల్, ఉమేశ్, కుల్దీప్, చహల్, పాండ్యా, ఇషాంత్, దినేశ్ కార్తీక్.
‘సి’ గ్రేడ్ (రూ. 1 కోటి): జాదవ్, పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, రైనా, పార్థివ్, జయంత్.
Comments
Please login to add a commentAdd a comment