జగ్గూదా... అల్విదా...
♦ అధికార లాంఛనాలతో బీసీసీఐ చీఫ్ అంత్యక్రియలు
♦ కడసారిగా దర్శించుకున్న క్రీడా ప్రముఖులు
తెలిసిన వాళ్లని, తెలియని వాళ్లనీ ఆప్యాయంగా పలకరించే ఆ నవ్వు శాశ్వతంగా దూరమయింది. భారత క్రికెట్‌ను బంగారు బాతులా మార్చిన ఆ మేథస్సు మాయమయింది. పక్క దేశాల బోర్డులను అన్నలా ఆదుకున్న ఆ పెద్దరికం ఇక కనిపించదు. తన ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తుచేసే క్రికెట్ చాణక్యుడు సెలవుతీసుకున్నాడు. భారత క్రికెట్ అమితంగా ప్రేమించే జగ్గూదా అంత్యక్రియలు పూర్తయ్యాయి. కోల్‌కతాలో అభిమానులు కదలిరాగా... పలువురు ప్రముఖులు దాల్మియాకు వీడ్కోలు పలికారు.
కోల్‌కతా : భారత క్రికెట్‌కు దశ.. దిశ చూపించిన దార్శనికుడి ఆఖరి ప్రయాణం ముగిసింది. బరువెక్కిన హృదయాలతో తమ ముద్దుబిడ్డకు కోల్‌కతా చివరిసారిగా వీడ్కోలు పలికింది. బీసీసీఐతో పాటు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని కూడా ఆర్థికంగా పరిపుష్టి చేసిన తెలివైన పాలకుడు జగ్మోహన్ దాల్మియా అంత్యక్రియలు సోమవారం ఘనంగా ముగిశాయి. క్రికెట్‌ను అమితంగా ప్రేమించిన 75 ఏళ్ల దాల్మియా బీసీసీఐ అధ్యక్షుడి హోదాలోనే అనంతలోకాలకు పయనం కావ డం ఆయనకు దక్కిన అపురూప భాగ్యం. తీవ్ర గుండెపోటుతో ఆదివారం రాత్రి మరణించిన దాల్మియా పార్థివదేహాన్ని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) కార్యాలయంలో అభిమానుల సందర్శనార్ధం ఉంచారు.
బీసీసీఐని తిరుగులేని స్థాయిలో నిలిపిన ‘జగ్గూదా’ను కడసారి చూసేందుకు మాజీ క్రికెటర్లతో పాటు బోర్డు సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మధ్యాహ్నం 12.15 గంటలకు దాల్మియా నివాసం (10, అలిపూర్) నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర 12.50కి ఈడెన్ గార్డెన్‌లోని క్యాబ్ కార్యాలయానికి చేరుకుంది. భారత టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి, బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ పార్థీవ దేహాన్ని దర్శించారు. రెండు గంటల పాటు క్యాబ్ కార్యాలయంలో ఉంచిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు శ్మశానవాటికకు చేర్చారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో దాల్మియా అంత్యక్రియలు జరిపేందుకు నిర్ణయించారు. సాయంత్రం 4 గంటలకు గంధపు చెక్కలపై ఉంచిన దాల్మియా పార్థివ దేహానికి ఆయన కుమారుడు అభిషేక్, కూతురు వైశాలి అంతిమ క్రియలు జరిపి లాంఛనాన్ని ముగిం చారు. ఆయనకు నివాళి అర్పించిన వారిలో సీఎంతో పాటు ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్, ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు శరద్ పవార్, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, బోర్డు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, క్యాబ్ అధికారులు ఉన్నారు. ఆయన బతికున్నంతకాలం సొంతకొడుకులా చూసుకున్న బెంగాల్‌టైగర్ సౌరవ్ గంగూలీ తీవ్ర విషాదంతో కనిపించారు. అంతకుముందు దాల్మియా చివరి కోరిక మేరకు ఆయన నేత్రాలను వన్ముక్త ఐ బ్యాంక్ సేకరించింది.
సంతాపాల వెల్లువ
దాల్మియా మృతిపై పలువురు క్రికెటర్లు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. క్రికెట్‌కు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ధోని, కోహ్లితోపాటు రోహిత్, యువరాజ్, లక్ష్మణ్, అశ్విన్ తదితరులు ట్విట్టర్‌లో నివాళి అర్పించారు.
►‘జీవితాన్ని క్రికెట్‌కు అంకితం చేసిన గొప్ప వ్యక్తి. లక్షల్లో కూడా లేని బోర్డు ఆదాయాన్ని వేల కోట్లుగా మార్చిన సమర్థ పాలకుడు. ఆయన ఆలోచనల వల్లే భారత క్రికెట్ అత్యున్నత స్థాయిలో ఉంది’
- ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్.
► ‘దాల్మియా అంకితభావం కలిగిన క్రీడాపాలకుడు. ధైర్యం కలిగిన మనిషి. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని ఎంతోమంది అభిమానిస్తారు. నాకైతే వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు’
- అనురాగ్ ఠాకూర్.
► ‘క్రికెట్‌కు దాల్మియా అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. కుటుంబసభ్యులకు నా సానుభూతి’
- ధోని.
► ‘దాల్మియాజీ మృతి వార్త నన్ను విషాదంలో నింపింది. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి’ - విరాట్ కోహ్లి.
► ‘ఎల్లప్పుడే ముఖంలో చెదరని చిరునవ్వుతో కనిపించే దాల్మియాను ఇక చూడలేం. ఈ విషయం ఎంతగానో బాధిస్తోంది’ - సునీల్ గవాస్కర్.
హెచ్‌సీఏ, ఏసీఏ సంతాపం: దాల్మియా మృతి పట్ల హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ), ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) సంతాపం వ్యక్తం చేశాయి. భారత క్రికెట్‌కు దాల్మియా చేసిన సేవలను హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్, కార్యదర్శి జాన్ మనోజ్ కొనియాడారు. దాల్మియా వల్లే ఆటకు ప్రత్యేక గుర్తింపు దక్కిందని ఏసీఏ అధ్యక్షుడు డీవీఎస్‌ఎస్ సోమయాజు, కార్యదర్శి గోకరాజు గంగరాజు గుర్తు చేసుకున్నారు.