చెన్నై: ఐపీఎల్‌లో వీరాభిమానుల గురించి చెప్పాల్సి వస్తే ముందు వరుసలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్సే ఉంటారు. ఐపీఎల్ సన్నాహాల్లో భాగంగా ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ సాధన చేస్తుంటే జనం విరగబడి వచ్చారు. ఒక మ్యాచ్‌కు వచ్చినట్లుగా తలపించే రీతిలో ప్రాక్టీస్ సెషన్లకు ప్రేక్షకులు కనిపించారు. ఇదంతా తమ ఆరాధ్య ఆటగాడు ధోని కోసమే! గత ఏడాది జులైలో ప్రపంచకప్ ముగిసిన తర్వాత మళ్లీ మ్యాచ్ ఆడని ధోని ఐపీఎల్‌లో బరిలోకి దిగుతుండటంతో వారిలో ఉత్సాహం రెట్టింపయింది. ఐపీఎల్‌లో మెరుపులకు ముందు ప్రత్యక్షంగా ధోని బ్యాటింగ్‌ను చూసేందుకు తరలి వచ్చారు. అయితే ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో ధోని సాధన ముగిసింది. ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందో తెలియని స్థితిలో ఫ్రాంచైజీ తమ సన్నాహాలను నిలిపివేసింది. దాంతో ధోని కూడా ఆదివారం రాంచీకి బయల్దేరాడు. ధోనికి వీడ్కోలు చెబుతున్నట్లుగా ఫ్రాంచైజీ వీడియో పోస్ట్ చేసింది. అన్నట్లు ధోని భవిష్యత్తు, ప్రపంచ కప్ జట్టులో చోటు వంటివి ఐపీఎల్ ప్రదర్శనతో ముడిపడి ఉన్నాయని గత కొంతకాలంగా కోచ్, సెలక్టర్లు పదే పదే చెబుతూ వచ్చారు. మరి ఐపీఎల్ జరగకపోతే ధోని ఫామ్‌ను, ప్రదర్శనను ఎలా అంచనా వేస్తారో!
Comments
Please login to add a commentAdd a comment