
చెన్నై: ఐపీఎల్ సీజన్‌లో భాగంగా మంగళవారం సొంతగడ్డపై జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నైకి అంతగా కలిసిరాలేదు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై చేసింది 131 పరుగులే. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ సునాయసంగా ఛేదించింది. బ్యాటింగ్‌లో విఫలమైన చెన్నై జట్టు బౌలింగ్‌లోనూ అంతగా ప్రభావం చూపలేకపోయింది. దీనికితోడు చెన్నై ఆటగాళ్ల ఫీల్డింగ్ తప్పిదాలు ముంబైకి కలిసివచ్చాయి. ముఖ్యంగా 132 పరుగుల లక్ష్యఛేదనలో ఆద్యంతం చెలరేగిపోయిన సూర్యకుమార్ యాదవ్‌ను తక్కువ స్కోరుకే ఔట్ చేసే అవకాశం చెన్నైకి వచ్చింది.
దీపక్ చాహర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ ఒకింత పేలవమైన షాట్ ఆడాడు. దీంతో బంతి గాల్లోకి లేచింది. తనకు కొద్ది దూరం నుంచి వెళుతున్న బంతిని పరిగెడుతూ అందుకునే ప్రయత్నం చేసిన మురళీ విజయ్ చివరికీ క్యాచ్‌ను వదిలేశాడు. ఒకింత కష్టమైపా ఈ క్యాచ్‌ను విజయ్ పట్టుకొని ఉంటే మ్యాచ్ వేరే తరహాలో ఉండేది. కీలకమైన దశలో క్యాచ్‌లో వదిలేసిన విజయ్‌పై మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ రీప్లేలో విజయ్‌పై ధోని ఆగ్రహం స్పష్టంగా కనిపించింది.