
ముంబై మెరుస్తుందా!
* 41వ టైటిల్‌పై కన్ను
* నేటి నుంచి సౌరాష్ట్రతో రంజీ ఫైనల్
పుణే: రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై క్రికెట్ జట్టుకు ఘనమైన నేపథ్యం ఉంది. ఇప్పటిదాకా ఈ జట్టు రంజీ టైటిల్‌ను రికార్డు స్థాయిలో 40 సార్లు తమ ఖాతాలో వేసుకుంది. ఈనేపథ్యంలో ఈ సంఖ్యను పెంచుకునేందుకు ఆదిత్య తారే సేనకు చక్కటి అవకాశం లభించింది. నేటి (బుధవారం) నుంచి జరిగే ఫైనల్లో ముంబై జట్టు సౌరాష్ట్రను ఎదుర్కోనుంది. ఇది ముంబైకి 45వ ఫైనల్ కాగా సౌరాష్ట్రకు రెండోది. 2012-13లో ఈ రెండు జట్ల మధ్యే రంజీ ఫైనల్ జరిగింది.
సచిన్ కూడా ఆడిన ఆ మ్యాచ్‌ను ముంబై మూడు రోజుల్లోనే ముగించి ఇన్నింగ్స్ 125 పరుగులతో నెగ్గడమే కాకుండా 40వ సారి టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ముంబై జట్టు ప్రదర్శన అంత ఆశాజనకంగా సాగలేదు. మూడు సీజన్ల అనంతరం ఇప్పుడు మరోసారి ఇరు జట్లు ఢీకొనబోతున్నాయి. గత రికార్డును పరిశీలిస్తే 1990-91 తర్వా త ముంబై జట్టు తాము ఆడిన 10 ఫైనల్స్‌లోనూ నెగ్గి టైటిల్ ఎగరేసుకుపోయింది. క్రితం ఫైనల్లో ఆడిన ఆదిత్య తారే, అభిషేక్ నాయర్, ధావల్ కులకర్ణి, శార్దుల్ ఠాకూర్, విశాల్ దభోల్కర్ ఈసారి కూడా ఆడబోతున్నారు. మరోవైపు సౌరాష్ర్ట జట్టు గత ఫైనల్లో ఎదురైన ఓటమికి కసి తీర్చుకోవడంతో పాటు తమ తొలి టైటిల్ కోసం సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధపడుతోంది.
ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ముంబై
ముంబై జట్టు అన్నిరకాలుగా పటిష్టంగానే కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ (1204 పరుగులు), అఖిల్ హెర్వాడ్కర్ (879), సూర్యకుమార్ యాదవ్‌లతో లైనప్ బాగుంది. కెప్టెన్ తారే సెమీస్‌లో సెంచరీ సాధించి ఊపు మీదున్నాడు. బౌలర్ శార్దూల్ ఠాకూర్ (33 వికెట్లు) ఇప్పటికే జట్టు నుంచి టాప్‌లో ఉండగా ఇక్బాల్ అబ్దుల్లా (నాలుగు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు) దూసుకెళుతున్నాడు. వీరికి సీనియర్లు ధావల్ కులకర్ణి, విశాల్ దభోల్కర్, బల్విందర్ సంధూ సహకారం అందించనున్నారు.
బౌలర్లను నమ్ముకున్న సౌరాష్ట్ర
జయదేవ్ షా నేతృత్వంలోని సౌరాష్ట్ర అవకాశాలు బౌలర్లపై ఆధారపడి ఉన్నాయి. ఈ జట్టు నుంచి ఇప్పటికే జయదేవ్ ఉనాద్కట్ (36 వికెట్లు), స్పిన్నర్లు కమలేష్ మక్వానా (33), ధర్మేంద్ర (27) ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచి జట్టుకు విజయాలు అందించారు. బ్యాటింగ్‌లో చతేశ్వర్ పుజారా, షెల్డన్ జాక్సన్ రాణింపు కీలకం.
ఉ. గం. 9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం