వినోద్ కాంబ్లీకి ఇంకా దురదగా ఉందట!
ముంబై: పట్టుమని పాతికేళ్లైన నిండకముందే అనూహ్యరీతిలో టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన వినోద్ కాంబ్లీకి ఇప్పుడు 44 ఏళ్లు. వివాదాస్పద ప్రవర్తనతో వ్యక్తిగతంగానేకాక క్రికెట్ పరంగానూ చిక్కులు ఎదుర్కొని, ఆటకు దూరమైన ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మన్ కు.. బ్యాట్ పట్టాలని, కసితీరా షాట్లు కొట్టాలని ఇంకా దురదగా ఉందట. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్ కు కొడుకుతోపాటు వీక్షించిన కాంబ్లీ.. మ్యాచ్ అనంతరం 'ఇంకా ఆడాలని చేతులు దురదపెడుతున్నాయి' అంటూ ట్వీట్ చేశాడు.
తనలాంటి ఎడమచేతి వాటం ఆటగాడైన గౌతం గంభీర్ డ్రైవ్ షాట్లు కొట్టడాన్ని ఆనందించానని, దిలిప్ వెంగ్ సర్కార్ తో కాసేపు ముచ్చటించానని చెప్పుకొచ్చాడు కాంబ్లీ. 'నీ టైమ్ లో నువ్వు కూడా ఆటను ఇలాగే ఎంజాయ్ చేసేవాడివి కదా' అని దిలీప్ సార్ తనతో అన్నట్లు పేర్కొన్నాడు. 90వ దశకం ప్రారంభంలో భారత జట్టులోకి వచ్చిన కాంబ్లీ తాను ఆడిన మొదటి ఏడు టెస్ట్ మ్యాచ్ లలోనే నాలుగు సెంచరీలు (వాటిలో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి) సాధించాడు. 104 వన్ డేలు ఆడి రెండు సెంచరీలు, 14 అర్ధసెంచరీలు చేశాడు. ఒక్క టీ20 మ్యాచ్ ఆడకుండానే ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రతిభ కున్నప్పటికీ వివాదాస్సద ప్రవర్తనతో అనేక చిక్కులు ఎదుర్కొన్నాడు. 2011లో అధికారికంగా రిటైర్ మెంట్ ప్రకటించిన కాంబ్లీ.. అలవాటైన వివాదాలతో అప్పుడప్పుడూ వార్తల్లో కనిపించడం, చిన్ననాటి స్నేహితుడు సచిన్ టెండూల్కర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.