గౌరవం కాపాడదాం | name of the race leaders for the first time in the history of cricket series | Sakshi
Sakshi News home page

గౌరవం కాపాడదాం

Published Fri, Sep 25 2015 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM

గౌరవం కాపాడదాం

గౌరవం కాపాడదాం

క్రికెట్ ప్రపంచంతో వారిద్దరికీ ఏ సంబంధం లేదు. ఆటగాళ్లుగా గానీ ఆటలో పరిపాలకులుగా గానీ తమదైన ముద్ర వేసిన ఘనత కాదు.

చరిత్రలో తొలిసారి క్రికెట్ సిరీస్‌కు జాతినేతల పేరు
దూకుడు కంటే ఆటకే ప్రాధాన్యం ఇవ్వాలి
గాంధీ-మండేలా పేరు నిలబెట్టాలి
 

క్రికెట్ ప్రపంచంతో వారిద్దరికీ ఏ సంబంధం లేదు. ఆటగాళ్లుగా గానీ ఆటలో పరిపాలకులుగా గానీ తమదైన ముద్ర వేసిన ఘనత కాదు. కానీ ఆ ఇద్దరు మహనీయులకు ఇప్పుడు జెంటిల్మెన్ గేమ్‌తో కొత్త అనుబంధం ఏర్పడిపోయింది. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య జరిగే సిరీస్‌లకు ఆయా దేశాల దిగ్గజ క్రికెటర్ల పేర్లే పెట్టారు. తొలి సారి జాతీయ నాయకుల పేర్లతో భారత్, దక్షిణాఫ్రికా సిరీస్ ప్రారంభం కానుంది. మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా సిరీస్‌గా దీనిని వ్యవహరించనున్నారు. మరి శాంతి కాముకులైన ఆ ఇద్దరి పేర్లతో జరిగే ఈ పోరు అదే తరహాలో సాగుతుందా... క్రికెటర్లు తమ ఆగ్రహావేశాలు నిగ్రహించుకొని కేవలంపై ఆటపైనే దృష్టి పెడతారా...తమ దేశ జాతిపితల పేర్లకు ఉన్న గౌరవం నిలబెడతారా!
 
సాక్షి క్రీడా విభాగం  దాదాపు 21 ఏళ్ల నిషేధం తర్వాత తొలి సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా జట్టు కోల్‌కతాకు వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌నుంచి హోటల్ రూమ్ వరకు వేలాది మంది ‘సౌతాఫ్రికా- ఇండియా ఫ్రెండ్‌షిప్ లాంగ్ లివ్’ అని రాసిన బ్యానర్లతో జట్టుకు స్వాగతం పలికారు. ఈ మర్యాదలపై జట్టు కెప్టెన్ క్లైవ్ రైస్ అయితే ‘నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై అడుగు పెట్టాక ఎలాంటి అనుభూతి పొందాడో ఇప్పుడు నాకర్థమైంది’ అని అమితానందం వ్యక్తం చేశాడు. అసలు దక్షిణాఫ్రికా మళ్లీ క్రికెట్‌లోకి అడుగు పెట్టగలదా అనే స్థితి ఉన్న దశలో బీసీసీఐ చూపించిన చొరవ ఆ దేశాన్ని మళ్లీ ఆటలో అడుగు పెట్టేలా చేసింది. ఈ కృతజ్ఞత దక్షిణాఫ్రికా చాలా సార్లు ప్రదర్శించింది కూడా. నాటినుంచి ఇప్పటి వరకు కూడా భారత్, దక్షిణాఫ్రికా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి.

బీసీసీఐ ఆగ్రహంతో...
అయితే 2013లో మాత్రం దక్షిణాఫ్రికా బోర్డు బీసీసీఐ ఆగ్రహానికి గురైంది. తాము తుది నిర్ణయం తీసుకోకముందే సఫారీలు షెడ్యూల్ ప్రకటించుకోవడం భారత బోర్డుకు నచ్చలేదు. దాంతో ఉన్నపళంగా మ్యాచ్‌లను తగ్గించి సిరీస్‌ను సగానికి కుదించింది. దాంతో ఆ బోర్డు ఆర్థికంగా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఈ పరిణామంలో దక్షిణాఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లొర్గాత్ ప్రధాన బాధితుడయ్యాడు. పదవిని పోగొట్టుకోగా, బీసీసీఐని ప్రసన్నం చేసుకునేందుకు అతను పడరాని పాట్లు పడ్డాడు. బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు బీసీసీఐని మెప్పించేందుకు ఏం చేయడానికైనా సిద్ధమంటూ ప్రకటించాడు. చివరకు అంతా సర్దుకోవడంతో ఇప్పుడు మళ్లీ ఇరు బోర్డుల మధ్య సఖ్యత నెలకొంది.

 రెండో ప్రయత్నంలో...
 యాషెస్, భారత్ పాల్గొనే కొన్ని సిరీస్‌లు మినహా ద్వైపాక్షిక సిరీస్‌లు జనాల్లో ఆసక్తి కలిగించడం లేదని... సరైన మార్కెటింగ్ లేక మిగతా దేశాలు ఇబ్బంది పడుతున్నాయని కొన్నాళ్ల క్రితమే ఐసీసీ సీఈ, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేవ్ రిచర్డ్‌సన్ వ్యాఖ్యానించారు. ఇందులో తమ దేశం బాధ కూడా అతని మాటల్లో కనిపించింది. దాంతో భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌కు మరి కాస్త పాపులార్టీ జోడిస్తే బాగుంటుందని వారు భావించారు. దాంతో 2013లోనే గాంధీ-మండేలా సిరీస్ ప్రతిపాదనను దక్షిణాఫ్రికా చేసింది. ఇందులో రెండు టెస్టులు భారత్‌లో ఆడి, తర్వాత మరో మూడు టెస్టులు తమ దేశంలో ఆడి సిరీస్ పూర్తి చేయాలని కోరింది. అయితే బీసీసీఐ దీనిని పూర్తిగా తిరస్కరించింది. నాటి సిరీస్ మధ్యలో మండేలా మృతి తర్వాతైనా పేరు పెడదామని భావిస్తే స్పాన్సర్ సన్‌ఫాయిల్ ఒప్పుకోలేదు. దాంతో అప్పుడు అది అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ అదే ప్రతిపాదనను తెస్తే ఈ సారి మన బోర్డు ఓకే అంది.

 శాంతి...శాంతి..
 ఈ సిరీస్ గురించి ప్రకటన చేసిన సమయంలో ఇది తాము మహాత్మా గాంధీకి ఇస్తున్న నివాళి అని, ప్రతీ భారతీయుడు ఆయన మార్గాన్ని అనుసరించాలనే ఈ పేరు పెట్టామంటూ బీసీసీఐ ప్రకటించింది. అటు దక్షిణాఫ్రికా బోర్డు కూడా ఈ ఇద్దరు మహనీయుల స్ఫూర్తితో మైదానంలో గెలుపు కోసం ప్రయత్నించాలని, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరింది. అయితే అసలు ఆట మొదలయ్యాకే క్రికెటర్లు ఏ మాత్రం దీనిని అమలు చేస్తారో తేలుతుంది. గత దక్షిణాఫ్రికా పర్యటనలో భంగపడిన భారత్, ఈ సారి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. జట్టులోని కుర్రాళ్ళంతా మంచి జోష్‌లో ఉన్నారు. శ్రీలంకపై విజయం తర్వాత ఢీ అంటే ఢీ అంటూ అన్నింటికి సిద్ధమైపోతున్నారు. ఆస్ట్రేలియా తరహాలో దక్షిణాఫ్రికా జట్టు స్లెడ్జింగ్‌లో మరీ ఘనాపాటి కాకపోయినా ప్లెసిస్, డి కాక్, డుమినిలాంటి ఆటగాళ్లు దూషణలో ఆరితేరినవాళ్లే. కేవలం సిరీస్‌కు పెట్టిన పేరు వీరిని ఎంత వరకు నియంత్రించగలదనేది చూడాలి. రెండు దేశాల ఆటగాళ్లు కూడా  వివాదానికి అవకాశం ఉన్న చోట ఒక్కసారి తమ శాంతి దూతలను గుర్తు చేసుకుంటే అగ్గిని ఆర్పేందుకు అవకాశం ఉంటుందేమో! ఎలాంటి సమస్యా రాకపోతే మంచిదే కానీ ఈ సుదీర్ఘ పర్యటనలో ఏదైనా తప్పు జరిగితే అది గాంధీ-మండేలాల శాంతి మంత్రానికి విఘాతం కలిగించినట్లే.
 
 స్వాతంత్య్ర సేనానులు...
 బీసీసీఐకి ప్రతిపాదించక ముందే దక్షిణాఫ్రికా మండేలా పేరును వాడేందుకు కావాల్సిన అనుమతులన్నీ తమ ప్రభుత్వం వద్ద తీసుకుంది. గాంధీ గురించి కూడా అదే చేయాలంటూ సూచించింది కూడా. ఇక్కడా ఎలాంటి అభ్యంతరం ఎదురు కాలేదు. ఫలితంగా ఈ సిరీస్‌కు పేరు ఖరారైంది. అహింసా పోరాటం ద్వారా భారత్‌కు స్వాతంత్య్రం సాధించి పెట్టి మహాత్మా గాంధీ ప్రపంచ వ్యాప్తంగా శాంతికి సంకేతంలా నిలిచారు. ఆయన స్ఫూర్తితో, అదే బాటలో నడిచి నెల్సన్ మండేలా తమ జాతి విముక్తి కోసం సుదీర్ఘ పోరాటం చేశారు. స్వాతంత్య్రం సాధించడంలో హింసకు తావు లేకుండా ఇద్దరూ అనుసరించిన మార్గాలు ఒకటే. టెస్టు సిరీస్‌కు మాత్రం ప్రత్యేకంగా ‘ఫ్రీడం ట్రోఫీ’గా నామకరణం చేయడం అంటే అందరిలోనూ ఆ రకమైన స్వాతంత్య్ర భావాలను గుర్తు చేసినట్లే. రెండు దేశాల్లోనూ తమ జాతి పితలపై ఉన్న అభిమానం, గౌరవం వల్ల ఈ క్రికెట్ సిరీస్ విలువ ఒక్కసారిగా పెరిగిపోయిందంటే ఆశ్చర్యం లేదు. ఈ టూర్ ద్వారా ప్రకటనల రూపంలోనే దాదాపు రూ. 250 కోట్లు రానున్నట్లు సమాచారం.
 
 ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఉన్న ద్వైపాక్షిక సిరీస్‌లన్నీ క్రికెటర్ల పేర్లతోనే ఉన్నాయి. తమ దేశానికి సంబంధించి అత్యుత్తమ ఆటగాడు లేదా ఇరు దేశాల మధ్య జరిగిన సిరీస్‌లలో అద్భుతంగా రాణించిన ఆటగాడి పేరును సిరీస్‌లకు పెట్టారు. వాటిని పరిశీలిస్తే...
 
►  బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (భారత్, ఆస్ట్రేలియా మధ్య)
  పటౌడీ ట్రోఫీ (భారత్, ఇంగ్లండ్ మధ్య ఇంగ్లండ్‌లో)
బేసిల్ డి ఒలీవరియా (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య)
చాపెల్-హ్యడ్లీ ట్రోఫీ (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య)
విజ్డన్ ట్రోఫీ (ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య)
వార్న్-మురళీధరన్ ట్రోఫీ (ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య)
ఫ్రాంక్‌వరెల్ ట్రోఫీ (ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య)

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement