
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మళ్లీ జాతీయ జట్టుకు ఆడతాడా, అసలు ఆడే అవకాశం ఉందా ఎవరికీ తెలియదు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ తర్వాత అతను మళ్లీ బరిలోకి దిగలేదు. ఈసారి ఐపీఎల్‌లో బాగా ఆడితే టి20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉందని వినిపించినా.... లీగ్ జరగడం సందేహంగా మారింది. ఈ నేపథ్యంలో ధోని ఇక రిటైర్ అయినట్లేనని, అధికారిక ప్రకటనే మిగిలిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ స్పందించాడు. ధోనిలాంటి అరుదైన క్రికెటర్లను బలవంతంగా రిటైర్మెంట్ వైపు తోస్తే అది జట్టుకు మేలు చేయదని అతను వ్యాఖ్యానించాడు. ‘ఒక్కసారి ధోని రిటైర్ అయితే అతడిని మళ్లీ వెనక్కి పిలిపించలేం.
క్రికెట్ ప్రపంచమంతా కీర్తించే దిగ్గజాలు కొందరే ఉంటారు. అలాంటివారు తరానికొక్కరే కనిపిస్తారు. ధోని కూడా అలాంటి ఆటగాడే. కాబట్టి అతడిని రిటైర్మెంట్ ప్రకటించమని బలవంత పెట్టవద్దు. తన మానసిక పరిస్థితి ఏమిటో ధోనికి మాత్రమే తెలుసు. సెలక్టర్లు ఎంపిక చేస్తే ఎలా తమ బాధ్యత నెరవేర్చాలో ఆటగాళ్లకు తెలుసు. అయితే ప్రస్తుత జట్టులో చోటు దక్కించుకునే సత్తా ధోనికి ఉందా అనేది ఎవరైనా చూస్తారు. నా దృష్టిలో మాత్రం భారత జట్టుకు మరికొంతకాలం సేవలు అందించగల సామర్థ్యం ఇంకా ధోనిలో ఉంది’ అని హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. అయితే ప్రపంచకప్‌లో ఒకటి, రెండు మ్యాచ్‌లలో ధోని తన సహజశైలిలో ఆడలేకపోయాడనే విషయం మాత్రం వాస్తవమని ఇంగ్లండ్ మాజీ సారథి అంగీకరించాడు.
‘లక్ష్య ఛేదనలో ఒకట్రెండుసార్లు అతను లెక్క తప్పినట్లు అనిపించింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతను ఏదో కారణం చేత చివరి వరకు కూడా నెమ్మదిగానే ఆడే ప్రయత్నం చేయడం నాకు గుర్తుంది. అయితే ఓవరాల్‌గా ధోని గొప్ప ఆటగాడు. కాబట్టి అతని రిటైర్మెంట్‌ను కోరుకునేవారు ఆలోచించి వ్యాఖ్య చేస్తే బాగుంటుంది’ అని నాసిర్ హుస్సేన్ సూచించాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 38 ఏళ్ల ధోని ఇప్పటివరకు 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2014లో టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని వన్డే, టి20 ఫార్మాట్‌లలో కొనసాగుతున్నాడు.