పేస్ దాటికి కుప్పకూలిన కివీస్
► వార్మప్ మ్యాచ్‌లో ఫామ్ లోకి వచ్చిన షమీ
► భారత్ లక్ష్యం 190
లండన్: చాంపియన్ ట్రోఫికి సన్నాహకంగా జరుగుతున్న భారత్-న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్‌లో భారత్ పేస్ విభాగానికి న్యూజిలాండ్ తలవంచింది. భారత్ బౌలర్లో మహ్మద్ షమీ, భువనేశ్వర్‌లు మూడేసి వికెట్లతో చెలరేగడంతో న్యూజిలాండ్ 38.4 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలింది. అంతకు ముందు టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే ఓపెనర్ గప్టిల్ వికెట్‌ను కోల్పోయింది.
మరో ఓపెనర్ లూక్ రోంచి (6 ఫోర్లతో 63) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా జడేజా అడ్డుకున్నాడు. చివర్లో నిషమ్ 46 పరుగులతో రాణించడంతో కివీస్ భారత్‌కు 190 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక ఐపీఎల్‌లో అంతగా ఆకట్టుకోని మహ్మద్ షమీ గప్టిల్(9), విలియమ్సన్(8), బ్రూమ్ (0)లను పెవిలియన్ చేర్చి కివీస్ టాపార్డర్‌ను దెబ్బతీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్ (3), జడేజా(2), అశ్విన్ (1), ఉమేశ్ యాదవ్ (1) వికెట్లు దక్కాయి.