మెక్ కల్లమ్ 100 శాతం సచ్చీలుడు:కివీస్
వెల్లింగ్టన్: గతంలో ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ ను ఆ దేశ క్రికెట్ బోర్డు వెనుకేసుకొచ్చింది. అతను ఎటువంటి ఫిక్సింగ్ కు పాల్పడలేదని బోర్డు తాజాగా స్పష్టం చేసింది. 2008 లో జరిగిన ఐపీఎల్, ఇంగ్లండ్ టూర్లలో మెక్ కల్లమ్ ఫిక్సింగ్ చేశాడని బ్రిటీష్ పత్రికల్లో వచ్చిన కథనం పెద్ద దుమారాన్నే రేపింది. కాగా, అతను ఆ టూర్లలో ఎటువంటి ఫిక్సింగ్ చేయలేదని కివీస్ తెలిపింది. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొంది. 'మాకు మెక్ కల్లమ్ పైపూర్తి నమ్మకం ఉంది. అతడు 100 శాతం సచ్చీలుడు. దీనిపై ఎటువంటి ఐసీసీ విచారణ అవసరం లేదు' అని కివీస్ తెలిపింది.
అప్పట్లో ఒక మాజీ క్రికెటర్ ను మెక్ కల్లమ్ కలిసి.. ఫిక్సింగ్ కు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. దానికి గాను మెక్ కల్లమ్ కు భారీ పారితోషకం కూడా అందినట్లు కూడా ఊహాగానాలు చెలరేగాయి. అనంతరం 2012లో జట్టు పగ్గాలను మెక్ కల్లమ్ అప్పజెప్పిన కివీస్ అతనిపై నమ్మకాన్ని చాటుకుంది. తరువాత మెక్ కల్లమ్ కివీస్ తరుపున ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు.