గప్టిల్ గర్జన
ఈ ఏడాదే వన్డే ప్రపంచకప్‌లో ‘డబుల్ సెంచరీ’ చేసిన జ్ఞాపకం ఇంకా చెదిరిపోకముందే... న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ మరో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో కేవలం 30 బంతుల్లోనే అజేయంగా 93 పరుగులు చేశాడు. 9 ఫోర్లు, 8 సిక్సర్లతో గప్టిల్ గర్జించడంతో న్యూజిలాండ్ జట్టు 118 పరుగుల లక్ష్యాన్ని కేవలం 8.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించింది.
30 బంతుల్లో 93H (9x4; 8x6)
* 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన న్యూజిలాండ్
* రెండో వన్డేలోనూ శ్రీలంక చిత్తు
క్రైస్ట్‌చర్చ్: ఇన్నాళ్లూ ఎన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా మెకల్లమ్ చాటుగా మిగిలిపోయిన మార్టిన్ గప్టిల్ మరోసారి సంచలన ఇన్నింగ్స్‌తో హోరెత్తించాడు. అనేక రికార్డులను త్రుటిలో కోల్పోయినా... చిరకాలం అభిమానుల మదిలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
హేగ్లీ ఓవల్ మైదానంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 27.4 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటయింది. కులశేఖర (19) టాప్ స్కోరర్. కివీస్ బౌలర్ మాట్ హెన్రీ (4/33) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నాలుగు వికెట్లు తీయగా... మెక్లీనగన్ మూడు వికెట్లు పడగొట్టాడు. బ్రేస్‌వెల్, సోధి ఒక్కో వికెట్ తీసుకున్నారు. న్యూజిలాండ్ జట్టు 8.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 118 పరుగులు చేసింది.
గప్టిల్ (30 బంతుల్లో 93 నాటౌట్; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), లాథమ్ (20 బం తుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు) జోరుతో లంచ్ విరామం కంటే ముందే మ్యాచ్ ముగిసిపోయింది. ఆడిన తొలి బంతికే చమీరా బౌలిం గ్‌లో గప్టిల్ ఇచ్చిన క్యాచ్‌ను సిరివర్ధనే వదిలేయడంతో లంక భారీ మూల్యం చెల్లించుకుంది. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిన గప్టిల్ కేవలం 12 బంతుల్లోనే 46 పరుగులకు చేరాడు. డివిలియర్స్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్-50 రికార్డు (16 బంతులు)ను గప్టిల్ అధిగమించేలా కనిపించినా...
కులశేఖర యార్కర్ల కారణంగా నెమ్మదించాడు. చివరకు 17 బంతుల్లో అర్ధసెంచరీ చేసి... న్యూజిలాండ్ తరఫున వేగంగా అర్ధసెంచరీ చేసిన మెకల్లమ్ రికార్డు (18 బంతులు)ను అధిగమించాడు. ఆ తర్వాత గప్టిల్ మరింత వేగం పెంచి మ్యాచ్‌ను తొందరగా ముగిం చాడు. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం న్యూజిలాండ్ 2-0 ఆధిక్యంలో ఉంది. మూడో వన్డే గురువారం జరుగుతుంది.
310 ఈ మ్యాచ్‌లో గప్టిల్ స్ట్రయిక్ రేట్ 310. క్రికెట్ చరిత్రలో ఇంతకంటే వేగంగా పరుగులు చేసిన క్రికెటర్ డివిలియర్స్ (స్ట్రయిక్ రేట్ 339) మాత్రమే.
17 వన్డేల్లో వేగంగా 50 పరుగులు చేసిన జాబితాలో గప్టిల్ రెండో స్థానానికి చేరాడు. ఈ రికార్డు డివిలియర్స్ (16 బంతులు) పేరిట ఉంది.
7 మరో 250 బంతులు మిగిలుండగానే న్యూజిలాండ్ ఈ మ్యాచ్ గెలిచింది. బంతుల పరంగా క్రికెట్ చరిత్రలో ఇది ఏడో అతి పెద్ద విజయం. 250 లేదా అంతకంటే ఎక్కువ బంతులు మిగిలుండగానే గెలవడం న్యూజిలాండ్‌కు ఇది మూడో సారి.
39 న్యూజిలాండ్ జట్టు ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లోనే 100 పరుగులు చేసింది. 16 బంతుల్లోనే 50 పరుగులు చేసింది. 2002 తర్వాత ఇంత వేగంగా ఓ జట్టు పరుగులు చేయడం ఇదే.
14.16 ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ రన్‌రేట్. ఇది చరిత్రలో రెండో అత్యధిక రన్‌రేట్. ఇందులో రికార్డు కూడా న్యూజిలాండ్ పేరిటే ఉంది. 2007లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ 15.83 రన్‌రేట్‌తో పరుగులు చేసింది.