
'బూమ్రాను చాలాకాలం బాధిస్తుంది'
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన తుది పోరులో భారత ఓటమికి పేసర్ జస్ఫిత్ బూమ్రా వేసిన నో బాల్ కూడా ఒక కారణం.
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన తుది పోరులో భారత ఓటమికి పేసర్ జస్ఫిత్ బూమ్రా వేసిన నో బాల్ కూడా ఒక కారణం. పాకిస్తాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ కు నో బాల్ ద్వారా బూమ్రా లైఫ్ ఇవ్వడం.. ఆపై ఆ క్రికెటర్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడటం జరిగిపోయాయి. పాకిస్తాన్ భారీ విజయంలో ఫకార్ జమాన్ సెంచరీ ముఖ్య భూమిక పోషించింది. దీనిపై బూమ్రాపై విమర్శల వర్షం కురుస్తోంది. కోట్లాది మంది అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోవడానికి బూమ్రా బౌలింగ్ కారణమైందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉంచితే, భారత్ ఓటమిలో భాగమైన ఆ నోబాల్ చాలాకాలం పాటు బూమ్రాను వేధిస్తుందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
'ఈ టోర్నమెంట్ ఆద్యంతం బూమ్రా అద్భుతమైన బౌలింగ్ వేశాడు. అయితే దురదృష్టవశాత్తూ ఫైనల్లో నో బాల్ వేయడం అతన్ని చాలాకాలం బాధిస్తుంది. ఆ ఓటమి పాకిస్తాన్ పై కాబట్టి ఆ నో బాల్ వేదన చాలా ఎక్కువగా ఉంటుంది'అని గవాస్కర్ పేర్కొన్నాడు.