జొకోవిచ్‌కు మళ్లీ కలిసొచ్చింది
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), పదో సీడ్ గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్‌స) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. తొమ్మిదో సీడ్ జో విల్‌ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్‌స)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-3, 6-2తో రెండు సెట్‌లు గెలిచి... మూడో సెట్‌లో తొలి గేమ్‌లో 15-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో సోంగా ఎడమ మోకాలికి గాయమైంది. దాంతో ఇక ఆడలేనంటూ సోంగా చెప్పడంతో జొకోవిచ్‌ను విజేతగా ప్రకటించారు. ఈ టోర్నీలో మూడోసారి కనీసం మూడు సెట్‌లు కూడా ఆడకుండానే జొకోవిచ్‌ను విజయం వరించడం విశేషం. రెండో రౌండ్‌లో జొకోవిచ్‌కు వెసెలీ (చెక్ రిపబ్లిక్) నుంచి వాకోవర్ లభించగా... మూడో రౌండ్‌లో యూజ్నీ (రష్యా) తొలి సెట్‌లోనే గాయం కారణంగా తప్పుకున్నాడు.
క్వార్టర్ ఫైనల్లో సోంగా మూడో సెట్ తొలి గేమ్‌లో వైదొలిగాడు. సెమీఫైనల్లో గేల్ మోన్‌ఫిల్స్‌తో జొకోవిచ్ తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో మోన్‌ఫిల్స్ 6-4, 6-3, 6-3తో తన దేశానికే చెందిన లుకాస్ పురుుపై గెలుపొందాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్‌పై ఐదు సెట్ల పోరులో సంచలన విజయం సాధించిన పురుు క్వార్టర్ ఫైనల్లో మాత్రం వరుస సెట్‌లలో ఓటమి చవిచూశాడు. మోన్‌ఫిల్స్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం.