బెల్‌గ్రేడ్ : కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు కరోనా బారీన పడుతూ వస్తున్నారు. తాజాగా టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా జొకోవిచ్ వెల్లడించాడు. జోకోవిచ్‌తో పాటు అతని భార్య జెలీనాకు పాజిటివ్ రాగా వారి పిల్లలకు మాత్రం నెగిటివ్ వచ్చింది. ఈ విషయంపై జోకోవిచ్ మాట్లాడుతూ..' నేను బెల్‌గ్రేడ్‌కు చేరుకున్న తర్వాత నా భార్య పిల్లలతో కలిసి కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నాను. రిపోర్టులో నాకు, నా భార్యకు పాజిటివ్ రాగా, పిల్లలకు మాత్రం నెగెటివ్ వచ్చింది. ఈ 14 రోజులు నా భార్యతో కలిసి హోం ఐసోలేషన్‌లోనే ఉంటు చికిత్స తీసుకుంటా' అని పేర్కొన్నాడు.('కోచ్ పదవి నాకు సవాల్‌గా కనిపిస్తుంది')
కాగా అంతకుముందు జొకోవిచ్ ఆధ్వర్యంలో జరిగిన ఎగ్జిబిషన్ సిరీస్ ఈవెంట్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జొకోవిచ్ క్షమాపణ చెప్పాడు. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు జరుగుతుండగానే బల్గేరియా ఆటగాడు దిమిత్రోవ్, క్రొయేషియా యువ ఆటగాడు బొర్నా చోరిచ్లతో పాటు జోకోవిచ్ ఫిట్‌నెస్ కోచ్ మార్కో పానిచి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ మ్యాచ్‌ల సందర్భంగానే జొకోవిచ్ వారితో కలిసి టెన్నిస్ ఆడడంతోనే కరోనా సోకినట్లు జొకోవిచ్ సోదరుడు జార్జె జొకోవిచ్ వెల్లడించాడు. మరోవైపు కరోనా ఉధృతి రోజురోజుకీ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ టోర్నీలేంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమర్శకులతో పాటు టెన్నిస్ వర్గాలు జొకోవిచ్ నిర్వాకంపై మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment