భువనేశ్వర్:మహారాష్ట్ర నుంచి తరలిపోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్ల్లో కొన్నింటిని తాము నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని ఒడిశా క్రికెట్ అసోసియేష్(ఓసీఏ)స్పష్టం చేసింది. ఐపీఎల్ మ్యాచ్లను కటక్లోని బార్బతి స్టేడియంలో నిర్వహించేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు ఓసీఏ సెక్రటరీ అక్షిర్బాద్ బెహెరా తెలిపారు. అయితే దీనిపై ఇంకా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)తమను ఇంకా సంప్రదించలేదన్నారు. ఒకవేళ బీసీసీఐ సంప్రదిస్తే మ్యాచ్లను నిర్వహణకు తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవంటూ ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తమ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని ముందుగానే హామీ ఇచ్చారు.
' మహారాష్ట్ర నుంచి తరలివెళ్లే కొన్ని ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకు బీసీసీఐ ఆమోదం తెలిసితే మా నుంచి పూర్తి సహకారాలు అందిస్తాం. కాకపోతే ఈ అంశంపై బీసీసీఐని మేము సంప్రదించే అవకాశం లేదు. ఫ్రాంచైజీల ఇష్ట ప్రకారమే హోం గ్రౌండ్ లు ఖరారవుతాయి కాబట్టి మేము ఎటువంటి ముందస్తు అడుగువేయలేదు''అని అక్షిర్బాద్ బెహెరా పేర్కొన్నారు.