
'ఇది భారత్.. ఇక్కడ ఆకట్టుకుంటేనే'
భువనేశ్వర్: రియో ఒలింపిక్స్లాంటి ఒక మెగా ఈవెంట్కు వెళ్లే ముందు క్రీడాకారులకు ఆర్థిక చేయూతనిస్తే వారి ప్రదర్శన మరింత మెరుగ్గా ఉంటుందన్న పలువురి భావనను జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కోచ్ బిశ్వేశర్ నంది తోసి పుచ్చాడు. ఇక్కడ ఎటువంటి నజరానాలు పొందాలన్నా ముందు మన ప్రదర్శన సంతృప్తికరంగా ఉంటేనే జరుగుతుందని విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నాడు. ' ఇది భారత్.. ఇక్కడ ముందుగా మనల్ని నిరూపించుకుంటేనే ప్రశంసాపూర్వకమైన నజరానాలు అందుతాయి. ఆయా క్రీడాకారులు గురించి ఏమైనా రాయాలన్నా వారు ప్రత్యేకతను చాటుకున్న తరువాతే జరుగుతుంది' అని ద్రోణాచార్య అవార్డు గ్రహీత బిశ్వేశ్వర్ తెలిపారు.
గత రాత్రి ఓ సన్మాన కార్యక్రమానికి హాజరైన బిశ్వేశ్వర్.. భారత్ లో ఆటగాళ్లకు రివార్డులు రావాలంటే వారు కచ్చితమైన ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. దాంతో పాటు రియో శిక్షణలో భాగంగా దీపాకు విదేశీ కోచ్ అవసరం లేదన్న తన వాదనను బిశ్వేశ్వర్ సమర్ధించుకున్నాడు. తాను ఏ ఎక్సర్సైజ్ చెప్పినా ఎంతో చురుగ్గా చేసే అమ్మాయికి మరొక కోచ్ అవసరం లేదనే భావించే ఆ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే రియోలో దీప శిక్షణను పొడిగించడానికి భయపడేవాడినని బిశ్వేశ్వర్ పేర్కొన్నాడు. ఇందుకు కారణం ఆమె తండ్రి తనకు ఇచ్చిన వార్నింగే ప్రధాన కారణమన్నాడు. కొన్ని సందర్భాల్లో దీప చాలా మొండిగా ఉంటుందనే విషయాన్ని ఆమె తండ్రి పదే పదే చెప్పడంతో ప్రాక్టీస్ సెషన్ను పొడిగించడానికి భయపడాల్సి వచ్చేదన్నాడు.