
'దీపా కర్మాకర్ పై ఒత్తిడి ఉంది'
రియో డి జనీరో:ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత తొలి మహిళా జిమ్నాస్టిక్గా రియోలో అడుగుపెట్టిన దీపా కర్మాకర్పై యావత్ భారతావని చాలా ఆశలు పెట్టుకుందని ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది స్పష్టం చేశారు. ప్రస్తుతం తమపై ఒలింపిక్స్ పతకం సాధించాల్సిన ఒత్తిడి అధికంగా ఉందని పేర్కొన్నారు. గత ఏప్రిల్లో దీపా సంచలన ప్రదర్శనతో రియోకు అర్హత సాధించిన అనంతరం ఆమెపై ఒక్కసారిగా ఆశలు పెరిగిపోయాయని..ఇప్పుడు ఒలింపిక్స్లో పతకం తీసుకొస్తుందని వంద కోట్ల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే తమపై అధిక ఒత్తిడి పడుతుందన్నాడు.
' రియోలో దీపా కర్మాకర్ పతకం సాధిస్తుందని అంతా భారీ అంచనాలతో ఉన్నారు. భారత అభిమానులకు పతకం కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇది బిలియన్ భారత ప్రజల ఆశ. దీపా కర్మాకర్ రియోకు అర్హత సాధించిన తరువాత ఆమెపై అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. కాకపోతే మెగా ఈవెంట్లో పతకం సాధించడమనేది కష్టంతో కూడుకున్నదని వారికి తెలియదు. మా శాయశక్తులా పతకం సాధించడానికి యత్నిస్తాం. ఆ విషయాన్ని అంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.దీపా కర్మాకర్ ప్రదర్శనపై నాకు కూడా నమ్మకం ఉంది.' అని బిశ్వేశ్వర్ నంది పేర్కొన్నారు.
ఏప్రిల్ లో రియో డీ జెనీరియోలో జరిగిన ఫైనల్ క్వాలిఫయర్ లో 52.698 పాయింట్లు నమోదు చేసిన దీపా కర్మాకర్ రియోకు అర్హత సాధించింది. తద్వారా ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్గా దీప రికార్డు నెలకొల్పింది. త్రిపురకు చెందిన ఈ 22 ఏళ్ల అమ్మాయి.. కామన్వెల్త్ గేమ్స్లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్గా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వరల్డ్ జిమ్నాస్ట్ చాంపియన్షిప్ కు అర్హత సాధించింది. ఒలింపిక్స్లో ఫైనల్ రౌండే లక్ష్యంగా బరిలోకి దిగిన దీపా కర్మాకర్.. ఆగస్టు 7వ తేదీన తొలి రౌండ్ పోరులో తలపడనుంది.