భారత్ బ్యాట్స్ ఉమన్ షూ లేస్ కట్టిన పాక్ క్రికెటర్!
భారత్- పాక్ మధ్య క్రికెట్ అంటే దాదాపు యుద్ధం స్థాయిలో సాగుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మొన్న ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్‌తో పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ సరదాగా నవ్వుతూ మాట్లాడటం చూస్తుంటే ఉద్రిక్తతలు చాలావరకు తగ్గినట్లే అనిపించింది. మహిళల క్రికెట్‌లోనూ ఇలాంటి సంఘటనే ఒకటి కెమెరాకు చిక్కింది.
ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో శనివారం జరిగిన భారత్, పాక్ మహిళల టి20 క్రికెట్ మ్యాచ్ సందర్భంలో పాకిస్తానీ క్రికెట్ జట్టుకు చెందిన ఆనం ఆమిన్.. ఇండియన్ బ్యాట్స్ ఉమన్ హర్‌ప్రీత్ కౌర్ షూ లేసును కట్టడం అందర్నీ ఆకట్టుకుంది. ఆ మ్యాచ్‌లో ఇండియా జట్టు పాకిస్తాన్ చేతిలో కేవలం రెండు పరుగుల తేడాతో పరాజయం పాలయ్యింది. అయితేనేం భారత్ క్రికెటర్‌కు షూ లేస్ కడుతూ ఆమిన్ స్పందించిన తీరు అందరి హృదయాలను గెలుచుకుంది. క్రికెట్ అభిమానుల్లో స్ఫూర్తిని రగిల్చింది. కెమెరాకు చిక్కిన ఈ చిత్రం.. భారత్, పాకిస్తాన్ దేశాల్లోని అభిమానుల ప్రశంసలను అందుకుంటోంది.