బులవాయో : ఆతిథ్య జింబాబ్వే జట్టు పేలవ ప్రదర్శన మరోసారి కొనసాగించగా.. పాకిస్తాన్ మరో భారీ విజయాన్ని సాధించింది. పాక్ పేసర్ ఫహీమ్ అష్రఫ్ 5/22 తో చెలరేగడంతో ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు వన్డేలు మిగిలుండగానే 3-0తో ఆ జట్టు కైవసం చేసుకుంది. జింబాబ్వే నిర్దేశించిన 68 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.5 ఓవర్లలోనే పాక్ ఛేదించింది. లక్ష్యఛేదనకు దిగిన పాక్ ఖాతా తెరవకుండానే ఓపెనర్ ఇనాముల్ హక్ వికెట్ కోల్పోయింది. అయితే స్వల్ప లక్ష్యం కావడంతో ఎలాంటి ఓత్తిడికి లోనుకాకుండా మరో ఓపెనర్ ఫకర్ జమాన్ (43 నాటౌట్ ; 24 బంతుల్లో 8 ఫోర్లు), బాబర్ అజమ్ (19 నాటౌట్ ; 34 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి జట్టును గెలిపించాడు.
తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే ఆరంభం నుంచే తడబాటుకు లోనైంది. అరంగేట్ర క్రికెటర్ మసవావురే (1)ని ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఉస్మాన్ ఖాన్ ఔట్ చేసి తొలి వికెట్‌ను అందించాడు. మరో ఓపెనర్ చిబాబా (16) వన్‌డౌన్ ప్లేయర్ మసకద్జా(10)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాలని చూసినా పాక్ బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ ఓటయ్యాక జింబాబ్వే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన పాక్ పేసర్ ఫహీమ్ అష్రఫ్ తన తొలి ఓవర్లోనే మూర్‌ను ఓట్ వేశాడు. బాబర్ అజమ్ క్యాచ్ పట్టడంతో 4వ వికెట్‌గా మూర్ నిష్క్రమించాడు. ఆపై ఏదశలోనూ జింబాబ్వే కోలుకోలేదు. ఫహీమ్ తన వరుస ఓవర్లలో వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టును వణికించాడు. షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో ముజ్రాబని (4) వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు.
ఆపై 26వ ఓవర్ తొలి బంతికి ఎంగరవ(1)ని బౌల్డ్ చేయడంతో 67 పరుగుల స్వల్ప స్కోరుకే జింబాబ్వే చాపచుట్టేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హీరో ఫకీమ్ అష్రఫ్ 5/22 సంచలన ప్రదర్శనతో కేవలం ముగ్గురు జింబాబ్వే ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. జింబాబ్వే నిర్దేశించిన 68 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ కోల్పోయిన పాక్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో వన్డేతో పాటు 5 వన్డేల సిరీస్‌ను 3-0తో పాకిస్తాన్ కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment