ఫిక్సింగ్‌కు పాల్పడే క్రికెటర్లను ఉరితీయాలి
న్యూఢిల్లీ: క్రికెట్‌లో ఫిక్సింగ్‌ను అరికట్టడానికి కఠినమైన చట్టాలు అవసరమని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన క్రికెటర్లకు మరణశిక్ష విధించాలని సూచించాడు. పాకిస్థాన్‌లో ఇటీవల మరోసారి స్పాట్ ఫిక్సింగ్ భాగోతం వెలుగుచూసిన నేపథ్యంలో మియాందాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
క్రికెట్‌లో అవినీతిని అరికట్టడానికి క్రీడా సంఘాలు తగిన చర్యలు తీసుకోవాలని మియాందాద్ సూచించాడు. క్రికెట్‌లో ఫిక్సింగ్ సంఘటలను క్షమించరాదని అన్నాడు. నిందితులను కఠినంగా శిక్షించడం వల్ల మిగిలిన క్రికెటర్లు అవినీతికి పాల్పడేందుకు భయపడుతారని చెప్పాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న పేసర్ మహ్మద్ ఇర్ఫాన్‌పై పీసీబీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అంతేగాక ఈ టోర్నీలోనే స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన మరో ఇద్దరు క్రికెటర్లు షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్ సస్పెండ్ అయ్యారు. ఇదే కేసులో మరో పాక్ క్రికెటర్ నసీర్ జంషెడ్ అరెస్టయ్యాడు. గతంలో పాక్ అంతర్జాతీయ క్రికెటర్లు మహ్మద్ ఆమీర్, సల్మాన్ బట్, మహ్మద్ ఆసిఫ్‌లు ఫిక్సింగ్ కేసులో సస్పెండ్ కావడంతో పాటు జైలు శిక్ష అనుభవించారు.