
పాకిస్థాన్ సంచలనం
షార్జా: దాదాపు నెల రోజుల క్రితం భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన జొహన్నెస్‌బర్గ్ టెస్టు అనూహ్య మలుపులతో ఉత్కంఠ రేపుతూ క్రికెట్ చరిత్రలో గొప్ప మ్యాచుల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇప్పుడు అదే తరహాలో పాకిస్థాన్, శ్రీలంకల మధ్య జరిగిన మూడో టెస్టుకు కూడా అద్భుత ముగింపు లభించింది. గెలుపునకు ఏ మాత్రం అవకాశం లేని దశనుంచి పాకిస్థాన్ చెలరేగి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.
శ్రీలంక నిర్దేశించిన 302 పరుగుల విజయలక్ష్యాన్ని పాక్ కేవలం 57.3 ఓవర్లలోనే అందుకుంది. 5 వికెట్ల తేడాతో లంకను ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మ్యాచ్ ఐదో రోజు సాధారణంగా బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉండే పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడిన పాక్‌కు ఈ అనూహ్య విజయం దక్కింది. అజహర్ అలీ (137 బంతుల్లో 103; 6 ఫోర్లు) సూపర్ సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ మిస్బావుల్ హక్ (72 బంతుల్లో 68 నాటౌట్; 4 ఫోర్లు), సర్ఫరాజ్ అహ్మద్ (46 బంతుల్లో 48; 4 ఫోర్లు, 1 సిక్స్) అతనికి అండగా నిలిచారు.
ప్రపంచ క్రికెట్‌లో 300కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సందర్భాల్లో... ఈ మ్యాచ్‌లో పాక్ నమోదు చేసిన రన్‌రేట్ (5.25) అన్నింటికంటే ఎక్కువగా ఉండటం విశేషం. అజహర్ అలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, ఏంజెలో మాథ్యూస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
నెమ్మదించిన లంక...
మ్యాచ్ చివరి రోజు ఆట ప్రారంభమయ్యే సమయానికి ఈ టెస్టు డ్రా కావడం దాదాపు ఖాయమనే పరిస్థితి ఉంది. 133/5 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట మొదలు పెట్టిన శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు ఆలౌటైంది. ప్రసన్న జయవర్ధనే (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రెహమాన్‌కు 4 వికెట్లు దక్కగా, అజ్మల్, తల్హా చెరో 3 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగుల ఆధిక్యం సాధించిన లంక పాక్ ముందు మిగిలిన 59 ఓవర్లలో 302 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.