అంతా బాగుంది...
అంతా బాగుంది...
Published Wed, Dec 7 2016 1:56 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శన కోచ్ అనిల్ కుంబ్లేకు ఆనందాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా బౌలర్లు రాణిస్తున్న తీరు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చక్కటి ఫీల్డింగ్ ఏర్పాట్లతో బౌలింగ్ ప్రణాళికలకు కెప్టెన్ కోహ్లి అండగా నిలిచాడని ఆయన వ్యాఖ్యానించారు. నాలుగో టెస్టు ప్రారంభానికి రెండు రోజుల ముందు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అన్ని మ్యాచ్‌లలో మన బౌలర్లు కీలక పాత్ర పోషించారు. అది ఇన్నింగ్‌సలో ఐదు వికెట్లు తీయడం కావచ్చు లేదా అసలైన సమయంలో తీసిన ఒకే ఒక వికెట్ కావచ్చు. మూడు వేర్వేరు పిచ్‌లపై కూడా ఫలితం సాధించగలిగాం.
దాని ప్రకారమే లెంగ్‌తను సరిదిద్దుకొని బౌలింగ్ చేయగలిగాం. కోహ్లి ఫీల్డింగ్ ఆలోచనలు, బౌలర్లు శ్రమకు తగిన గుర్తింపును తెచ్చేలా చేశాయి’ అని కుంబ్లే అన్నారు. సాధారణంగా ఆటగాళ్ల మధ్య పోలికలను తాను ఇష్టపడనని... షమీ, ఉమేశ్ ఇద్దరూ చాలా బాగా ఆడుతున్నారని ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘ఆట ముగిసే సమయంలో చివరి స్పెల్‌లో కూడా వారిద్దరు ఎంతో గొప్పగా బౌలింగ్ చేశారు. బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టి వికెట్లు తీయగలిగారు. ముఖ్యంగా 18 నెలల విరామం తర్వాత క్రికెట్‌లోకి వచ్చిన షమీ ఆడుతున్న తీరు స్ఫూర్తిదాయకం’ అని కుంబ్లే అన్నారు. మూడో టెస్టులో ముగ్గురు స్పిన్నర్లు కూడా అర్ధ సెంచరీ సాధించడం అద్భుతమన్న దిగ్గజ స్పిన్నర్, ఈ ఇన్నింగ్‌స జడేజాలో ఆత్మవిశ్వాసం పెంచిందన్నారు.
విజయ్ చెలరేగుతాడు...
ఓపెనర్ మురళీ విజయ్ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోలేకపోతున్నాడనే విమర్శను కుంబ్లే కొట్టిపారేశారు. ‘గత రెండేళ్లుగా మా జట్టులో అత్యంత నిలకడగా ఆడుతున్న బ్యాట్స్‌మన్ విజయ్. రాజ్‌కోట్‌లో అతను సెంచరీ కూడా చేశాడు. సిరీస్‌లో ఒకే తరహాలో అవుటైనా, షార్ట్ పిచ్ బంతి అతని బలహీనత కాదు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న విజయ్, త్వరలోనే మరో భారీ ఇన్నింగ్‌స ఆడతాడు’ అని కోచ్ సమర్థించారు. మరోవైపు పదే పదే ఓపెనర్లు మారుతున్నా, భారత్ బాగా ఆడుతోందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆటలో గాయాలు సహజమని, కోలుకున్న లోకేశ్ రాహుల్ మెరుగ్గా రాణిస్తాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఆడిన రోజులతో పోలిస్తే, తర్వాతి కాలంలో ఫిట్‌నెస్‌పై ఆటగాళ్లకు శ్రద్ధ పెరిగిందని, ఇప్పుడు భారత జట్టు అత్యంత ఫిట్‌గా కనిపిస్తోందని కుంబ్లే అన్నారు. మరోవైపు డీఆర్‌ఎస్ వినియోగంపై తమ ఆటగాళ్లంతా సంతృప్తిగా ఉన్నారని, ఈ విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
పార్థివ్ పటేల్ కొనసాగింపు...
వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా మూడో టెస్టు బరిలోకి దిగిన పార్థివ్ పటేల్‌కు మరో అవకాశం లభించింది. ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టులోనూ అతను ఆడతాడని బీసీసీఐ ప్రకటించింది. సాహా కోలుకున్నా... ముందు జాగ్రత్తగా అతనికి మరింత విశ్రాంతి కల్పించినట్లు బోర్డు చెప్పింది. మొహాలీ టెస్టులో పార్థివ్ రెండు ఇన్నింగ్‌సలలో 42, 67 నాటౌట్ పరుగులు చేశాడు. ‘ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు ఆడినా పార్థివ్ ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదు. కీపర్‌గా, అప్పటికప్పుడు ఓపెనర్‌గా కూడా తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నెరవేర్చాడు. కష్టానికి ఎప్పటికై నా గుర్తింపు లభిస్తుందని అతని పునరాగమనం చూపించింది. తన 16 ఏళ్ల వయసులోనే అతను ఒకసారి జట్టును ఓటమినుంచి రక్షించాడు. గడ్డం గీసుకుంటే ఇప్పటికీ అతను 16 ఏళ్లవాడిలాగానే కనిపిస్తాడు’ అని పార్థివ్ గురించి కుంబ్లే వ్యాఖ్యానించారు.
Advertisement