ఇంచియోన్ (దక్షిణ కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ నుంచి భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ నిష్క్రమించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో కశ్యప్ 13-21, 15-21 తేడాతో ప్రపంచ చాంపియన్ కెంటో మొమాటా(జపాన్) చేతిలో పరాజయం చెందాడు. తొలి గేమ్‌ను సునాయసంగా కోల్పోయిన కశ్యప్.. తిరిగి తేరుకోలేపోయాడు. దాంతో ఓటమి తప్పలేదు.
అంతకుముందు ఇరువురి మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా అందులో కూడా మొమాటాదే పైచేయిగా నిలిచింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులో కశ్యప్ 24–22, 21–8తో జాన్ ఒ జార్గెన్‌సెన్ (డెన్మార్క్)ను చిత్తుచేసి సెమీస్‌కు చేరినా.. మొమాటా ముందు తలవంచాడు. ఇటీవల నిలకడగా ట్రోఫీలు సాధిస్తున్న మొమోటాపై కశ్యప్ సంచలనం నమోదు చేస్తాడని ఎదురు చూసిన భారత బ్యాడ్మింటన్ అభిమానికి నిరాశే ఎదురైంది. మొమోటా తాజా గెలుపుతో ముఖాముఖి ఆధిక్యాన్ని 3-0కు పెంచుకున్నాడు. ఈ ఓటమితో కొరియా ఓపెన్‌లో భారత్ పోరాటం ముగిసింది. ఇక ఫైనల్లో తెయిన్ చెన్ చు(తైవాన్)తో మొమోటో తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment