రావల్పిండి: దాదాపు దశాబ్దం అనంతరం పాకిస్తాన్ గడ్డపై అంతర్జాతీయ టెస్టు జరగనుంది. బుధవారం నుంచి శ్రీలంక-పాక్ జట్ల మధ్య చారిత్రాత్మక తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ ఎహ్‌సాన్ మణి మీడియా సమావేశంలో మాట్లాడాడు. పాకిస్తాన్ అత్యంత సురక్షిత ప్రాంతమని, ఈ గడ్డపై నిరభ్యంతరంగా క్రికెట్ ఆడొచ్చనే సందేశాన్ని ఈ సిరీస్‌తో ప్రపంచానికి చాటి చెబుతామని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇప్పటినుంచి తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడబోమని, ఇక నుంచి తమతో ఆడాలనుకుంటే పాకిస్తాన్‌కే రావాలని స్పష్టం చేశాడు. మరో రెండుమూడేళ్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో స్వదేశంలో సిరీస్‌లు జరుగుతాయని ఎహ్‌సాన్ మణి ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఐర్లాండ్‌కు చెందిన కొంతమంది ప్లేయర్స్ తమ దేశంలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారన్నారు. పాక్‌స్తాన్‌లో ఆడకుండా ఉండేందుకు తమకు కారణాలు దొరకడం లేదని క్రికెట్ ఐర్లాండ్ సీఈఓ తమతో అన్నట్లు వివరించాడు. 2021లో ఇంగ్లండ్‌తో, 2022లో ఆసీస్‌తో పాక్‌లో సిరీస్‌లు నిర్వహిస్తామని, అదేవిధంగా వీలైతే 2023-24లో న్యూజిలాండ్‌తో సిరీస్ నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. రావల్పిండి వేదికగా ఆరంభం కానున్న తొలి టెస్టుపై యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నాడు. ఈ మ్యాచ్ టికెట్లలో అధిక శాతం స్థానిక స్కూల్, కాలేజీ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపాడు.
ఇక రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా లంక-పాక్‌ల మధ్య బుధవారం నుంచి తొలి టెస్ట్ ఆరంభం కానుంది. అనంతరం డిసెంబర్ 19 నుంచి 23 వరకు రెండో టెస్టు జరగనుంది. ఇక చివరగా 2009లో శ్రీలంక పాక్‌లో పర్యటించినప్పుడు వారు ప్రయాణిస్తున్న బస్సుపై టెర్రర్ అటాక్ జరిగిన విషయం తెలిసిందే. ఈ అటాక్‌లో లంక ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదంతం అనంతరం ఏ దేశం కూడా పాక్‌లో పర్యటించడానికి ధైర్యం చేయలేదు. తిరిగి శ్రీలంకతోనే పాక్‌లో క్రికెట్ పునరుజ్జీవనం పోసుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment