
ఐపీఎల్‌కు పెప్సీ రాం రాం!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో మూడేళ్లుగా కొనసాగుతున్న తమ అనుబంధాన్ని తెగదెంపులు చేసుకోవాలని పెప్సీకో కంపెనీ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలుగుతున్నట్టు బీసీసీఐకి తెలిపింది. దీంతో వచ్చే ఏడాది సీజన్‌కు కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2012లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐపీఎల్‌తో పెప్సీ 2017 వరకు కొనసాగాల్సి ఉంది. దీనికోసం బోర్డుతో రూ.396 కోట్ల భారీ మొత్తంతో డీల్ కుదుర్చుకుంది. అయితే స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం వెలుగు చూడడంతో ఐపీఎల్ ప్రతిష్టకు అపఖ్యాతి ఏర్పడిందన్న కారణంతో ఈ కూల్‌డ్రింక్ కంపెనీ తన మనసు మార్చుకుంది. వాస్తవానికి గతేడాదే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలని అనుకున్నా బోర్డు ఒత్తిడితో కొనసాగింది.
ప్రస్తుతం ఈ విషయంపై బీసీసీఐతో కంపెనీ చర్చలు జరుపుతోంది. మరోవైపు పెప్సీకో తప్పుకోవడం పెద్ద విషయం కాదని, తమకు ఇతర ఆలోచనలు ఉన్నాయని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఏం జరిగినా సామరస్యంగా జరుగుతుందని అన్నారు. మరోవైపు ఆసక్తి ఉన్న కంపెనీలతో చర్చించి పెప్సీ నుంచి హక్కులను వారికి బదలాయించే ఆలోచనలో బోర్డు ఉంది.
18న వర్కింగ్ కమిటీ సమావేశం
ముంబై: బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం ఈనెల 18న ముంబైలో జరుగనుంది. చాలా విషయాలు చర్చించే అవకాశాలు ఉండడంతో ఈ మీటింగ్ కీలకం కానుంది. కొత్త అధ్యక్షుడిగా నియమితులైన శశాంక్ మనోహర్ ఈ సందర్భంగా సభ్యులకు తన ప్రణాళికలను వెల్లడించనున్నారు.